175 ఏళ్లుగా చేప మందు పంపిణీ: మంత్రి తలసాని

175 ఏళ్లుగా చేప మందు పంపిణీ: మంత్రి తలసాని

అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా చేప మందు ప్రసాదం పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జూన్ 9వ తేదీన చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు మే 25వ తేదీ గురువారం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. బత్తిన హరినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు ఏండ్ల తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ ఏడాది జూన్ 9న చేప మందు ప్రసాదం పంపిణీ చేయనున్నారని మంత్రి తలసాని తెలిపారు.

"175 ఏళ్లుగా మృగశిర కార్తె రోజు చేప మందు పంపిణీ చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి కూడా ఆస్తమా రోగులు ఏటా హైదరాబాద్ వస్తారు. 9వ తేదీ ఉదయం 8 గంటల నుండి ఇరవై నాలుగు గంటల పాటు ఈ పంపిణి ఉండనుంది. ఈ ఏడాది 5 నుండి 7 లక్షల మంది వచ్చే అవకాశం ఉండటంతో నాలుగు క్వింటాల ప్రసాదం తయారు చేయిస్తున్నాము. చేప మందు కోసం కొర్రమీను చేప పిల్లలను మాత్రం ఉపయోగిస్తారు. ఈ ఏడాది సాధారణ క్యూ లైన్ తో పాటు వృద్ధులకు, వికలాంగులకు, ప్రత్యేక కౌంటర్లు ఏర్పటు చేయనున్నాము. అన్ని  శాఖల అధికారులు సమన్వయంతో ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా ప్రసాదం పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే జనాలకు ఆహారంతో పాటు మంచి నీటి సౌకర్యం అందించేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి" అని మంత్రి తలసాని వెల్లడించారు.