టొరంటో: కెనడాలో భారత సంతతి మహిళ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై హత్య కేసును నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం కెనడా వ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. మృతురాలిని టొరంటోకు చెందిన హిమాన్షి ఖురానా (30) గా గుర్తించారు. శుక్రవారం రాత్రి 10.41 గంటలకు స్ట్రాచన్ అవెన్యూ– వెల్లింగ్టన్ స్ట్రీట్ వెస్ట్ ప్రాంతం నుంచి పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు అందింది.
ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరుసటి రోజు వేకువజామున ఓ ఇంటిలో హిమాన్షి మృతదేహాన్ని గుర్తించారు. హిమాన్షి హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. టొరంటోకు చెందిన అబ్దుల్ గఫూర్ ను (32) హంతకుడిగా నిర్ధారించారు. అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. మృతురాలితో అతడికి ముందు నుంచే పరిచయం ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై టొరంటోలోని ఇండియన్ ఎంబసీ స్పందిస్తూ ‘ఎక్స్’ లో ఓ పోస్ట్ పెట్టింది. హిమాన్షి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించింది.
