మన బస్తీ – మన బడి పనులు మరింత వేగంగా జరగాలి : మంత్రి తలసాని

మన బస్తీ – మన బడి పనులు మరింత వేగంగా జరగాలి : మంత్రి తలసాని

మన బస్తీ – మన బడి పనులు మరింత వేగంగా జరగాలి
అధికారులను ఆదేశించిన మంత్రి తలసాని శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు : ‘మన బస్తీ – మన బడి’ పనులు మరింత వేగంగా చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ఆదేశించారు. గురువారం మాసబ్​ట్యాంక్​లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆఫీసులో మన బస్తీ – మన బడి కార్యక్రమం అమలుపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా గవర్నమెంట్​ స్కూళ్లలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు తెలుసుకున్నారు. డిప్యూటీ డీఈవోలు వారంలో నాలుగు రోజులు తమ పరిధిలోని స్కూళ్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. స్టూడెంట్లతో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకోవాలన్నారు. టాయిలెట్స్, కరెంట్, తాగునీరు సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. పనుల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.

స్కూళ్ల వారీగా స్టూడెంట్లు, తరగతి గదుల సంఖ్య, చేయాల్సిన పనుల పూర్తిస్థాయి సమాచారంతో ఈ నెల 11న జరిగే సమావేశానికి రావాలని  ఆదేశించారు. సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, సాయన్న, కౌసర్ మొహినోద్దిన్, మౌజం ఖాన్, టీఎస్‌‌ఈడబ్ల్యూఐడీసీ  చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, డీఈవో రోహిణి, డిప్యూటీ డీఈవోలు, ఇంజినీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.