కేసు సీబీఐకిస్తే క్లీన్‌‌ చిట్ ఇచ్చినట్టా?

కేసు సీబీఐకిస్తే క్లీన్‌‌ చిట్ ఇచ్చినట్టా?
  • మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌ ప్రశ్న
  • బీజేపీ నేతల సంబురాలు చేసుకునుడేందని కామెంట్

హైదరాబాద్‌‌, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి ఇస్తే నిందితులకు క్లీన్‌‌ చిట్‌‌ ఇచ్చినట్టా అని మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌ ప్రశ్నించారు. కేసీఆర్‌‌ ఫాం హౌస్‌‌ ఫైల్స్‌‌లో నవ్వుల పాలయ్యారని కేంద్ర మంత్రి కిషన్‌‌ రెడ్డి హేళనగా మాట్లాడుతున్నారని, తెలంగాణ పోలీసులను కించ పరుస్తున్నారని మండిపడ్డారు. బుధవారం బీఆర్‌‌ఎస్‌‌ ఎల్పీలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌‌, కాలేరు వెంకటేశ్‌‌, భూపాల్‌‌ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీబీఐ విచారణను కిషన్‌‌ రెడ్డి స్వాగతించడం తమకు అనుమానాలు కలిగిస్తోందన్నారు. ఆయన అమాసకు, పున్నానికి హైదరాబాద్‌‌కు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని, విమర్శలు చేయడానికి బదులు నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలన్నారు.

కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి..

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేతలు నార్కో అనాలసిస్‌‌, లై డిటెక్టర్‌‌ టెస్ట్‌‌కు సిద్ధమా అన్న కేటీఆర్‌‌ సవాల్‌‌కు కిషన్‌‌ రెడ్డి సమాధానం చెప్పాలని తలసాని డిమాండ్‌‌ చేశారు. బీజే పీ మీటింగులు పెట్టేది తెలంగాణ ప్రభుత్వాన్ని తిట్టడానికేనా అని ప్రశ్నించారు. కిషన్‌‌ రెడ్డిని గెలిపించి తప్పు చేశామని సికింద్రాబాద్‌‌ ప్రజలు అనుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.