నిమజ్జనాలపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తాం

నిమజ్జనాలపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తాం

హైదరాబాద్‌: హుస్సేన్ సాగర్‌‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ రోజు (ఆదివారం) ఉదయం ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌తో కలిసి ఖైరతాబాద్ గణపతికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. హుస్సేన్‌ సాగర్‌‌లో గణేష్‌ నిమజ్జనాలపై ఆంక్షలు విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో భక్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్లాస్టర్‌‌ ఆఫ్​ పారిస్‌తో చేసిన విగ్రహాలను ట్యాంక్‌ బండ్‌లో నిమజ్జనం చేయొద్దంటూ కోర్టు తీర్పు ఇచ్చే సమయానికే గణేష్‌ విగ్రహాలు మండపాల్లోకి చేరాయని చెప్పారు. 

నిమజ్జనం తర్వాత 48 గంటల్లో హుస్సేన్‌ సాగర్‌‌ను క్లీన్‌ చేస్తాం

6 నెలల ముందుగా కోర్టు నిర్ణయం చెప్తే బాగుండేదని తలసాని అభిప్రాయపడ్డారు. నిమజ్జనం పూర్తయిన 48 గంటల్లోకి హుస్సేన్‌ సాగర్‌‌ను క్లీన్ చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు. ఇప్పటికిప్పుడు బేబీ పాండ్స్ ఏర్పాటు చేయడం కష్టమన్నారు మంత్రి. పీఓపీ విగ్రహాలు తయారీ చేసుకుంటూ ఎంతో మంది బతుకున్నారని చెప్పారు. ఈ ఏడాది యధావిధిగా నిమజ్జనం జరిగేలా చూడాలన్నారు తలసాని. కోర్టులో రివ్యూ పిటిషన్‌లో సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.