ఫారెస్ట్ ఆఫీసర్లను అడ్డుకున్న ఆదివాసీలు..ఆసిఫాబాద్ జిల్లా మోతిగూడలో బోరు వేసే విషయంలో గొడవ

ఫారెస్ట్ ఆఫీసర్లను అడ్డుకున్న ఆదివాసీలు..ఆసిఫాబాద్ జిల్లా మోతిగూడలో బోరు వేసే విషయంలో గొడవ
  • సర్వే నిర్వహించి న్యాయం చేస్తామన్న కలెక్టర్ 

జైనూర్, వెలుగు: తాగునీటి కోసం బోరు వేసే విషయంలో ఫారెస్ట్​ఆఫీసర్లు, ఆదివాసీలకు మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం జాములదార పంచాయతీ పరిధిలోని మోతిగూడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మోతిగూడలో స్థానిక ఆదివాసీలు గురువారం బోరు వేస్తుండగా ఫారెస్ట్​ఆఫీసర్లు అడ్డుకున్నారు. ఇది అటవీ ప్రాంతమని, అనుమతి లేదని చెప్పి పనులు నిలిపివేశారు.

దీంతో స్థానికులు వారితో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న కలెక్టర్ కె.హరిత డీఎఫ్​వో నిరంజన్, డీసీసీ ప్రెసిడెంట్​ఆత్రం సుగుణ అక్కడికి చేరుకొని గ్రామస్తులతో సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. అటవీ ప్రాంతం పేరుతో ఇండ్ల నిర్మాణం, రోడ్డు పనులు, తాగునీటి కోసం బోర్లు వేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య తీవ్రతను గుర్తించిన కలెక్టర్ సర్వే నిర్వహించి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో రోడ్లు, విద్యుత్ తదితర సమస్యలను పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. తహసీల్దార్ రాంచందర్,  ఆదివాసీ నాయకులున్నారు.