నేతన్నలకు ఏడాదంతా పని కల్పిస్తున్నాం.. గత ప్రభుత్వం వదిలి పెట్టిన బకాయిలన్నీ చెల్లించాం: మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు

నేతన్నలకు ఏడాదంతా పని కల్పిస్తున్నాం.. గత ప్రభుత్వం వదిలి పెట్టిన బకాయిలన్నీ చెల్లించాం: మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు

రాజన్నసిరిసిల్ల, వెలుగు: ‘నేతన్నలకు ఏడాదంతా పని కల్పించేందుకు అన్ని ఆర్డర్లు కేటాయిస్తున్నాం, ఇందిరమ్మ చీరల ఆర్డర్లు సిరిసిల్ల నేత కార్మికులకు ఇచ్చాం. గత ప్రభుత్వం పెట్టిన కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం. చేనేత రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది.’ అని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. 

మంగళవారం సిరిసిల్లలో నేతన్న పొదుపు తిఫ్ట్  ఫండ్  చెక్కులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్​తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.33 కోట్ల చేనేత రుణాలు ఉన్నాయని, వాటిని త్వరలోనే మాఫీ చేస్తామని చెప్పారు. 

వేములవాడలో రూ.50 కోట్లతో యార్న్  డిపోను ఏర్పాటు చేశామని, 100 మ్యాక్స్  సొసైటీలకు 250 మెట్రిక్ టన్నుల నూలు సప్లై చేశామని తెలిపారు. నేతన్న చేయూత, నేతన్న పొదుపు, నేతన్న బీమా వంటి అనేక పథకాల బకాయిలను జమ చేస్తున్నామన్నారు. నేతన్నల బ్యాక్  బిల్లింగ్  బకాయిలుకూడా తీర్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

వస్త్ర పరిశ్రమల్లో ఆధునిక సాంకేతికతను పెంచేందుకు హ్యాండ్లూమ్  యూనివర్సిటీ(ఐఐఐహెచ్ టీ) ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ ఆర్థిక స్థితిగతులను సరి చేసుకుంటూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను సీఎం అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ విప్  ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ ప్రిన్నిపల్  సెక్రటరీ శైలజ రామయ్యర్, కలెక్టర్  సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు.