- ఇప్పటికీ 23 జిల్లాల్లో లోటు వర్షపాతం
- యాసంగి సీజన్‌పైనా ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం
- ఉమ్మడి జిల్లాల సమీక్షల్లో వచ్చిన సూచనలతో కార్యాచరణ
- సెక్రటేరియెట్‌లో మంత్రి సమీక్ష
- 32 లక్షల ఎకరాల్లో సాగు తగ్గే అవకాశం: చిన్నారెడ్డి
హైదరాబాద్, వెలుగు: భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్న నేపథ్యంలో బోరుబావుల కింద వరి సాగు చేయవద్దని రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గత రెండు రోజులుగా అక్కడక్కడ కురుస్తున్న వర్షాలను చూసి రైతులు వరి సాగుపై నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. గురువారం సెక్రటేరియెట్‌లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఐఎండీ అంచనాల ప్రకారం.. రానున్న సెప్టెంబర్ నాటికి వర్షాభావ తీవ్రత పెరిగి డిసెంబర్ వరకు ఎల్-నినో ప్రభావం కొనసాగే అవకాశాలు ఉన్నాయన్నారు. యాసంగి సీజన్‌పైనా దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలోని 23 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని, ఒకటి రెండు జిల్లాలు మినహా ఎక్కడా సాధారణ వర్షపాతం నమోదు కాలేదని మంత్రి పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో గోదావరి, కృష్ణా నదులకు భారీ వరదలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదన్నారు. మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఉన్న నీరు ప్రధానంగా తాగునీటి అవసరాలకే సరిపోతుందని, ప్రతి జలాశయంలో నీటి నిల్వలపై మండలాల వారీగా రైతులకు నిరంతరం సమాచారం అందించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో గత ఏడాదితో పోలిస్తే దాదాపు 23 శాతం మేర సాగు విస్తీర్ణం తగ్గే అవకాశముందని చెప్పారు. ఎల్-నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లాలవారీగా వచ్చిన సూచనల ఆధారంగా సమగ్ర రాష్ట్రస్థాయి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించనున్నట్లు మంత్రి చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలవారీగా ఇన్‌చార్జి మంత్రుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, శాస్త్రవేత్తలు చేసిన సూచనలను పరిశీలించి కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.
ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యం
అధిక నీటి అవసరమున్న వరి, పత్తి పంటలకు బదులుగా పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, భువనగిరి, నల్గొండ జిల్లాల్లో కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటికే సాగులో ఉన్న పంటలను రక్షించేందుకు శాస్త్రీయ పద్ధతులను రైతులకు వివరించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు సూచించారు.
విత్తనాలు, డ్రిప్ పరికరాలు రెడీ చేయండి
ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు, ఎరువులు, డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే రైతు వేదికలను విత్తనాల పంపిణీ కేంద్రాలుగా వినియోగించాలని సూచించారు. నేషనల్ సీడ్ కార్పొరేషన్ నుంచి అవసరమైన విత్తనాలు సమకూర్చాలని, వాటిపై 50 శాతం వరకు సబ్సిడీ కల్పించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని అధికారులను ఆదేశించారు.
బ్యాంకులు రుణ కేటాయింపులు పెంచాలి
ఈ ఏడాది రూ.58 వేల కోట్ల వ్యవసాయ రుణాల టార్గెట్‌కు గాను ఇప్పటివరకు రూ.20 వేల కోట్లు రైతులకు అందించినట్లు బ్యాంకు అధికారులు తెలిపారని మంత్రి పేర్కొన్నారు. రైతులకు పంట రుణాలతో పాటు సూక్ష్మ సేద్యం కోసం అధిక రుణ సదుపాయాలు కల్పించాలని బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. నాబార్డు ద్వారా ఆర్ఐడీఎఫ్ కింద లభించే రూ.498 కోట్లను వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు.
గ్రామ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ
ప్రతి మండలం, ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారులను నియమించే అంశాన్ని పరిశీలించాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి సూచించారు. గ్రామ స్థాయిలో ఎల్-నినో పరిస్థితులు, నీటి లభ్యత, ప్రత్యామ్నాయ పంటలు, ప్రభుత్వ సూచనలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖకు మంత్రి తుమ్మల సూచించారు. రైతులకు వాతావరణ ఆధారిత శాస్త్రీయ సలహాలు అందించడం, పశుగ్రాసం, పశువైద్య సేవలను సిద్ధం చేయడం, జిల్లా, మండల స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
32 లక్షల ఎకరాల్లో సాగు తగ్గే అవకాశం: చిన్నారెడ్డి
రాష్ట్రంలో ఇప్పటివరకు 24 శాతం లోటు వర్షపాతం నమోదైందని, సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 32 లక్షల ఎకరాల్లో సాగు తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
