టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ..పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలి..అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ..పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలి..అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

హైదరాబాద్, వెలుగు: టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పత్తి సేకరణపై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో మంత్రి ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులు “కాపస్  కిసాన్” యాప్‌‌‌‌లో నమోదు సమయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌‌‌‌ను నియమించాలన్నారు. 

కాటన్  కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆహ్వానించిన టెండర్లను ఈ నెల 10న ఓపెన్ చేశారని, ఈ టెండర్లలో మొత్తం 328 జిన్నింగ్ మిల్లులు పాల్గొన్నాయని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. టెక్నికల్  టెండర్లు శనివారానికి పూర్తయ్యాయని వెల్లడించగా.. టెండర్  ప్రక్రియ పూర్తయిన వెంటనే జిన్నింగ్ మిల్లుల జాబితాను జిల్లా కలెక్టర్లకు అందజేసి, వాటిని పత్తి కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. 

సీసీఐ ప్రవేశపెట్టిన “కాపస్ కిసాన్” యాప్  ద్వారా రైతులు తమ పత్తి కొనుగోలు కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియలో రైతులు సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు.