కృష్ణా నీళ్లు దోచుకుపోతుంటే గోదావరి అంటారేంటి : మంత్రి తుమ్మల నాగేశ్వర్​ రావు

కృష్ణా నీళ్లు దోచుకుపోతుంటే గోదావరి అంటారేంటి : మంత్రి తుమ్మల నాగేశ్వర్​ రావు

 హైదరాబాద్, వెలుగు : కృష్ణా నీళ్లను ఏపీ దోచుకుపోతుంటే గోదావరి నీళ్లు తీసుకుపోవాలని తాము చెప్పామని బీఆర్ఎస్​నేతలు అంటారేంటని మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు అన్నారు. సోమవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏపీ తమ భూభాగంలో ఫ్లడ్ లైట్లు పెట్టి 24 గంటలు రాయలసీమ ఎత్తిపోతల పనులు చేసుకుంటోందని, మనం ఎన్జీటీకి వెళ్లి స్టేలు తెచ్చినా వాళ్లను ఆపలేకపోయామన్నారు. గోదావరి నుంచి 2 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయన్నది నిజమేనని.. ఇద్దరు సీఎంల మీటింగ్​తర్వాతనే రాయలసీమ ఎత్తిపోతలకు టెండర్లు పిలిచి పనుల్లో వేగం పెంచారని అన్నారు. 

పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల్లోనే మన వాటా 45 టీఎంసీలే సాధించుకోలేకపోయామన్నారు. అలాంటప్పుడు వాళ్లను గోదావరి జలాలు తీసుకోవాలని అన్నామని హరీశ్​రావు చెప్పడం అర్థరహితమన్నారు. గోదావరి నీళ్లు శ్రీశైలానికి వచ్చేది ఎప్పుడు.. రాయలసీమకు పోయేది ఎప్పుడో చెప్పాలని నిలదీశారు. 

అది వృథా ఖర్చు కాదు :  కడియం శ్రీహరి

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.27 వేల కోట్లు ఇచ్చినా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి అంటున్నారని, ఆ వ్యాఖ్యలు సరికావని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ట్రిబ్యునల్​వేసినప్పుడు పూర్తయిన ప్రాజెక్టులతో పాటు ఆన్​గోయింగ్​ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయిస్తుందని తెలిపారు. సభలో ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను మన కౌంటర్​పార్టీగా ఉన్న ఏపీ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఆ రెండు రోజులు సభ వద్దు : మల్లారెడ్డి

వసంత పంచమి సందర్భంగా 14, 15 తేదీల్లో 26 వేల పెండ్లిలు ఉన్నాయని.. ఆ రెండు రోజులు సభ పెట్టొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పీకర్​ను కోరారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై సభలో సీరియస్​గా డిస్కషన్​సాగుతున్న సమయంలో మల్లారెడ్డి ఇలాంటి విజ్ఞప్తి చేయడంతో సభలో నవ్వులు పూశాయి.