పత్తి విత్తనాల కోసం రైతులు ఆందోళన చెందొద్దు: మంత్రి తుమ్మల

పత్తి విత్తనాల కోసం రైతులు ఆందోళన చెందొద్దు: మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: పత్తి విత్తనాల కోసం రైతులు ఆందోళన చెందొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇప్పటికే వివిధ కంపెనీలకు చెందిన 68 లక్షల 16 వేల 967 పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మిగతా ప్యాకెట్లు జూన్ 5 కల్లా జిల్లాలకు చేరేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గురువారం  రాష్ట్రస్థాయి అధికారులతో, పలు సీడ్స్ కంపెనీలతో  మంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు

 రాష్ట్రంలో కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు చేసుకొని సిద్ధంగా ఉన్నారని.. విత్తన కంపెనీలు ప్రణాళిక ప్రకారం మిగతా పత్తి విత్తన ప్యాకెట్లను కూడా జూన్ 5 కల్లా జిల్లాలకు చేరవేయాలని ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒకే రకమైన విత్తనాలనే రైతులందరూ కొరుతున్నారని గుర్తుచేశారు. యూనివర్సిటి పరిశోధనల ప్రకారం.. మార్కెట్లో లభ్యమవుతున్న పతి విత్తన  హైబ్రిడ్ల దిగుబడి ఒక్కటేననే విషయాన్ని  రైతులందరికి చెప్పాల్సిన అవసరం ఉందని తెలి పారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పత్తితో పాటు పచ్చిరొట్ట విత్తనాలు అవసరం మేరకు ఉన్నాయని వెల్లడించారు. రైతులెవరూ తొందరపడకుండా వారి అవసరం మేరకు విత్తనాలను ప్రభుత్వ ఆమోదిత దుకాణాల నుంచి కొనాలని సూచించారు. బిల్లులు తీసుకొని భద్రపరుచుకోవాలన్నారు.