అవసరానికి మించి యూరియా కొనొద్దు : మంత్రి తుమ్మల

అవసరానికి మించి యూరియా కొనొద్దు : మంత్రి తుమ్మల
  • ప్రతిపక్ష నాయకుల మాటలతో రైతులు  భయాందోళనలకు గురికావొద్దు: మంత్రి తుమ్మల
  • రోజువారీ నిల్వలను  పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశం 

హైదరాబాద్, వెలుగు:  ప్రతిపక్ష నాయకుల మాటలు విని భయాందోళనలకు గురికావొద్దని, యూరియాను అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌రావు సూచించారు.  కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా సరఫరాలో భారీ లోటు ఏర్పడిందని, ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

 రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ చేయాలని, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుత యూరియా పరిస్థితులపై మంత్రి తుమ్మల సోమవారం సీఎస్​ రామకృష్ణారావుతో కలిసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో యూరియా సరఫరా పరిస్థితులను మంత్రికి  అధికారులు వివరించారు.   

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏప్రిల్‌‌లో 1.7 లక్షల  టన్నులు, మే లో 1.6 లక్షలు, జూన్ లో 1.7 లక్షలు,  జులైలో 1.6 లక్షలు, ఆగస్టులో 1.7 లక్షల టన్నుల యూరియా కేటాయించిందన్నారు. అయితే  ఏప్రిల్ లో 1.21 లక్షలు , మేలో 0.88 లక్షలు, జూన్‌‌లో 0.98 లక్షలు, జులైలో 1.43 లక్షలు , ఆగస్టులో 0.82 లక్షల  టన్నులు మాత్రమే సరఫరా చేసిందన్నారు. దీంతో కేటాయింపుల ప్రకారం రాష్ట్రానికి యూరియాను సరఫరా చేయలేకపోవడంతో ప్రస్తుతం2.98 లక్షల టన్నుల యూరియా లోటు ఏర్పడిందన్నారు.

రైతులకు పంటకు సరిపడా యూరియాను ఒకేసారి అందించలేకపోతున్నందున, ప్రస్తుతం ఉన్న లోటును దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.  యూరియా వినియోగాన్ని సమీక్షించేందుకు ప్రతి నెల టాప్​ 20 కొనుగోలుదారులు, తరచుగా కొనేవారు, అధికంగా అమ్మిన రిటైలర్ల వివరాలను (dbtfert.nic.in) వెబ్‌‌సైట్‌‌లో తనిఖీ చేయాలన్నారు. రైతులకు యూరియాను మితంగా ఉపయోగించేలా అవగాహన కల్పించాలని సూచించారు.