
- పాడి పంటలను ప్రోత్సహించేందుకు పటిష్ట చర్యలు
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్, వెలుగు: విజయ డెయిరీ ఖర్చు తగ్గించి ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఖమ్మం విజయ డెయిరీ యూనిట్‌ను మంత్రి కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 సంవత్సరాల క్రితం 1975లో విజయ డెయిరీ యూనిట్ ప్రారంభమైందని ఆ భవనాన్ని వెంటనే రెనోవేషన్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ యూనిట్ లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తే విద్యుత్ ఖర్చు ఆదా అవుతుందన్నారు.
మంచి నీరు కూడా మున్సిపాలిటీ నుంచి సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. విజయ డెయిరీ చుట్టుపక్కల కాలనీలోని డ్రెయిన్లు సంస్థలోకి వస్తున్నాయన్నారు. దీని కోసం డ్రైన్ డైవర్షన్, కాంపౌండ్ వాల్ నిర్మాణంపై ప్రతిపాదనలు రెడీ చేయాలని మంత్రి తెలిపారు. ఖమ్మం జిల్లాలో విజయ డెయిరీ చిల్లింగ్ యూనిట్ల ఆధునీకరణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు.
మన రాష్ట్రంలో పాడి ఉత్పత్తులు తగ్గిపోవడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి పాలు తెచ్చుకోవాల్సిన అవసరం వస్తోందన్నారు. యూరియాతో తయారు చేసే కల్తీ పాలు ఎక్కువ అవుతున్నాయన్నారు. జిల్లాలో పాడి పరిశ్రమ పెరగాలని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. విజయ డెయిరీ సమస్యలపై అధికారులతో సమీక్ష చేస్తామన్నారు. నీటి సరఫరా, సానిటేషన్ పై చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
రోజూ 5 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నాం
తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఎండి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. రోజూ 5 లక్షల లీటర్ల పాలసేకరణ చేస్తున్నామన్నారు. 10 ఎస్ఎన్ఎఫ్ పాలకు రూ. 85 ఇస్తున్నామని, ఇది దేశంలో ఎక్కువ రేటని చెప్పారు. రోజూ 50 వేల లీటర్ల పాలు సంక్షేమ శాఖ ద్వారా తల్లులకు, 50 వేల లీటర్ల పాలు పిల్లలకు అందిస్తున్నామన్నారు. 20 వేల లీటర్ల పాలు ప్రాసెస్ చేసుకునేలా నూతన ప్లాంట్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. పాత ప్లాంట్ కు నీటి సరఫరా చేయగలిగితే మెరుగ్గా పని చేస్తామన్నారు.
కొత్తగూడెం ఎస్సీ కాలనీ నందు రూ. 75 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు, ఖమ్మం నగరం15వ డివిజన్ లోని కొత్తగూడెం వెటర్నరీ హాస్పిటల్ రోడ్డు నందు రూ. 25 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రైన్ల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డినగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కార్పొరేటర్లు, ఖమ్మం ఆర్డీఓ నర్సింహరావు, విజయ డెయిరీ డీడీ రవికుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.