
- అంతేగానీ.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకోం
- బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావుపై తుమ్మల ఫైర్
- అగ్రికల్చర్ యంత్రాలపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వండి
- ప్రధాని మోదీకి మంత్రి లేఖ
హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు కేంద్రంలో పలుకుబడి ఉంటే నడ్డాతో మాట్లాడి రాష్ట్రానికి యూరియా తెప్పించాలని, అది మానేసి ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జీవితంలో ఎప్పుడూ యూరియాను చూడని నేతలు కూడా తమపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వ్యవసాయ యంత్ర పరికరాలపై విధించిన 12 శాతం జీఎస్టీని ఎత్తేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంత్రి తుమ్మల గురువారం లేఖ రాశారు.
ఇదే విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కూడా లేఖలు పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదలు, యూరియా సరఫరా సమస్యలపై మంత్రి తుమ్మల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు వైఖరిపై మండిపడ్డారు. ‘‘రాంచందర్ రావుకు పలుకుబడి ఉంటే నడ్డాతో మాట్లాడి యూరియా తెప్పించాలి. అంతేగానీ.. రాని యూరియాను వచ్చినట్లు అబద్ధాలు చెప్పి పార్టీని బాగు చేయాలనుకోవద్దు. రైతులను మోసం చేసే పార్టీలకు మేలు జరగదనే వాస్తవం తెలుసుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరినా సహకరించడం లేదు. పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనలు చేయడంతోనే 50వేల టన్నులు ఇస్తామని చెప్పారు.
అధికారం కోల్పోయిన పార్టీలు.. కేంద్రం మెడలు వంచైనా యూరియా తెస్తామని అంటున్నాయి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తుతాం.. బటన్లు నొక్కుతాం అంటున్నాయి. ప్రజలే అధికారం పీకేసిన పార్టీలు ఇలా పెత్తనం చేస్తామంటే అసహ్యంగా ఉంది. రాజకీయాలకు అతీతంగా రైతుల కోసం పనిచేస్తే మేము కూడా హర్షిస్తాం’’అని తుమ్మల అన్నారు. కాగా, జిల్లా వ్యవసాయ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో యూరియా స్టాక్ పై మంత్రి ఆరా తీశారు.