భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి..పంట నష్టం నివారణ చర్యలు తీసుకోవాలి: తుమ్మల

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి..పంట నష్టం నివారణ చర్యలు తీసుకోవాలి: తుమ్మల
  • యూరియా సప్లైపై ఆందోళన వద్దు
  • వ్యవసాయ శాఖపై అధికారులతో మంత్రి సమీక్ష

హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో పంట నష్ట నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం సెక్రటేరియెట్​లో భారీ వర్షాలు, ఎరువుల సరఫరా, వ్యవసాయ శాఖకు సంబంధించిన పలు అంశాలపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడారు. ‘‘భారీ వర్షాల నేపథ్యంలో పంట నష్టాన్ని నివారించేందుకు రైతులను అప్రమత్తం చేయాలి. రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలి. సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో సకాలంలో సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌కు అభినందనలు. 

యూరియా సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడంతోనే వారం రోజుల్లో 31వేల టన్నుల యూరియాను కేంద్రం పంపింది. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో అదనంగా 39వేల టన్నులు వస్తాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’అని తుమ్మల తెలిపారు. రైతులు ఆధునిక సాగు పద్ధతులు అవలంబించేలా యాంత్రీకరణకు ప్రోత్సాహం ఇవ్వాలని ఆదేశించారు. కూలీల సమస్య తగ్గించడంతో పాటు అధిక దిగుబడులు సాధించేందుకు యాంత్రీకరణ కీలకమని తెలిపారు. 

ఉద్యోగుల ఆలస్యంపై మంత్రి ఆగ్రహం

వ్యవసాయ శాఖ, కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌లలో కొందరు ఉద్యోగులు ఆలస్యంగా విధులకు హాజరవడంపై మంత్రి తుమ్మల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం 10:40 అయినా ఆఫీసుకు రాని వారి నుంచి వివరణ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మళ్లీ రిపీట్ అయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉద్యోగులంతా రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు.