- ఆయిల్ పామ్‌లో అగ్రస్థానమే లక్ష్యం..
- వచ్చే మూడేండ్లలో 10 లక్షల ఎకరాల్లో సాగు చేస్తం
- కొత్తగా 7 ఆయిల్పామ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయండి
- వ్యవసాయాధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని ఆయిల్ పామ్ ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో కృషి చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 73,696 మంది రైతులు 2.74 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. సోమవారం ఆయన సెక్రటేరియెట్‌లో హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులు, ఉద్యాన శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.." రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల ఎకరాల మేరకు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన భూమి ఉంది. వచ్చే నాలుగేండ్లలో ఏటా రెండు లక్షల ఎకరాల చొప్పున విస్తరణ చేపట్టాలి. మూడేండ్లల్లో10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగుతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తుంది. గత ఐదేండ్లలో నిర్దేశించిన 6.54 లక్షల ఎకరాల లక్ష్యంలో కేవలం 2.28 లక్షల ఎకరాలకే సాగు జరిగింది.
తక్కువ పురోగతి సాధించిన వరంగల్, నారాయణపేట, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, గద్వాల్, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో కంపెనీలు మరింత వేగంగా పనిచేయాలి. కంపెనీలు రైతులతో ప్రత్యక్ష సంబంధాలు పెంచుకోవాలి.
ఆయిల్పామ్నిర్వహణలో నీటి వినియోగం, ఎరువుల పంపిణీ, అంతర పంటలు, కలుపు నివారణపై దృష్టి సారించాలి. కొత్తగా సాగు చేసే తోటల్లో దిగుబడి తగ్గకుండా పర్యవేక్షించాలి. రైతుల సందేహాల నివృత్తి కోసం రైతు సలహా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. రైతు వేదికల్లో కంపెనీ ప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలి. విజయవంతమైన రైతులను రైతు వేదికల్లో మాట్లాడించేలా చర్యలు తీసుకోవాలి" అని అధికారులను మంత్రి ఆదేశించారు.
త్వరలో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు
ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు. వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్, సహకార శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఫ్యాక్టరీల పురోగతిపై సమీక్షిస్తూ, త్వరలో ప్రారంభమయ్యే ఏడు యూనిట్ల వివరాలను మంత్రి వెల్లడించారు.
