పార్లమెంట్ సాక్షిగా యూరియాపై తప్పుడు లెక్కలు

పార్లమెంట్ సాక్షిగా యూరియాపై తప్పుడు లెక్కలు
  • ఈ సీజన్​లో రాష్ట్రానికి కేటాయించింది9.80 లక్షల టన్నులే: మంత్రి తుమ్మల 
  • సప్లై చేయకపోవడంతో అందులో2.24 లక్షల టన్నుల లోటుంది
  • కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్​కు లేఖ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు సరఫరా చేసిన యూరియాపై పార్లమెంటులో కేంద్రం తప్పుడు లెక్కలు చెప్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. ఈ వానాకాలం సీజన్‌‌కు సంబంధించి రాష్ట్రానికి కేంద్రం 9.80 లక్షల టన్నుల యూరియా కేటాయించగా, పార్లమెంట్‌‌లో మాత్రం 20.20 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నట్లు చెప్పడం శోచనీయమన్నారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌‌కు ఆయన లేఖ రాశారు.

రాష్ట్రానికి ఏప్రిల్ నుంచి జులై వరకు 6.60 లక్షల టన్నుల యూరియా సరఫరా కావాల్సి ఉండగా, కేవలం 4.36 లక్షల టన్నులు మాత్రమే అందాయని, దీంతో 2.24 లక్షల టన్నుల లోటు ఏర్పడిందని ఆయన వివరించారు. ఈ కొరత వల్ల రాష్ట్ర రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు లెటర్ రాసినట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ వంటి వేదికలలో తప్పుడు లెక్కలు సమర్పించడం రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జులై వరకు సరఫరా కాని 2.24 లక్షల టన్నుల యూరియాతో పాటు, ఆగస్టు నెలకు కేటాయించిన యూరియాను వెంటనే సప్లై చేయాలని కేంద్రాన్ని కోరారు.