అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • మార్చి 2026 నాటికి రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు కంప్లీట్​
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు : అభివృద్ధి పనులను నిర్ధిష్ట గడువులోగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు.  సోమవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ హాల్ లో మున్నేరు నదిపై రిటైనింగ్ వాల్, కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, ఖమ్మం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులపై నగర మేయర్ పునుకొల్లు నీరజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి అధికారులతో సమీక్షించారు. మున్నేరు నదికి ఇరువైపులా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ కు అవసరమైన భూ సేకరణ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. వాల్​ నిర్మాణానికి బైపాస్ రోడ్డు నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు మొదట, కేబుల్ బ్రిడ్జి నుంచి ప్రకాశ్​ నగర్ బ్రిడ్జి వరకు  రెండవ విడత భూసేకరణ చేయాలని ఆదేశించారు.

భూముల బదలాయింపు కోసం అడ్వాన్స్ పోజిషన్ వెంటనే అందించాలని సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులతో మంత్రి ఫోన్ లో మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి  చేయాలన్నారు. ప్రతినెలా పనుల పురోగతిపై రిపోర్టు ఇవ్వాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం నగరం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్ టీపీ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ వెంటనే పూర్తి చేయాలని తెలిపారు.  ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఎస్ఈ రంజిత్, ఇరిగేషన్ ఎస్ఈ ఎం. వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకోబు, విద్యుత్ ఎస్ఈ, తహసీల్దార్లు రాంప్రసాద్, సైదులు, ఏజెన్సీ ప్రతినిధులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు పూర్తికి కార్యాచరణ సిద్ధం

అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. కేఎంసీ కార్యాలయంలో ఖమ్మం నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాది మున్నేరు వరదల వల్ల వేలాది ప్రజలు ఇబ్బంది పడ్డారని, ప్రతిఏటా వరదల కారణంగా 10 డివిజన్ల ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారని, దీనికి శాశ్వత పరిష్కారంగా రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని తెలిపారు. వాల్ నిర్మాణానికి అడ్డంకిగా మారిన భూసేకరణ సమస్య, భూ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేసినట్లు చెప్పారు.  ఎస్టీపీ నిర్మాణం, కేబుల్ బ్రిడ్జ్ దగ్గర రోడ్డు వెడల్పు పనులు, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, 10 రోజుల్లో భూములు సంబంధిత ఏజెన్సీలకు అప్పగించాలని  రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 

రాష్ట్రంలో 3 కేబుల్ బ్రిడ్జిలు ఉన్నాయని, హైదరాబాద్ లోని దుర్గం చెరువు, కరీంనగర్ లోని మానేరు నదిపై కేబుల్ బ్రిడ్జి లను తన హయాంలోనే మంజూరు చేశానని,  నేడు ఖమ్మంలో మున్నేరు నదిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని, మిగిలిన రెండు బ్రిడ్జిల కంటే మున్నేరు కేబుల్ బ్రిడ్జి పెద్దదన్నారు. కేబుల్ బ్రిడ్జి వద్ద పర్యాటకంగా కూడా అభివృద్ధి జరిగేలా టూరిజం ప్యాకేజీ ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. బాలపేట, బల్లేపల్లి, ఖానాపురం చెరువుల నుంచి వర్షాకాలం వరద నీరు అధికంగా వస్తుందని, దీని నియంత్రణకు 200 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను చేపట్టామన్నారు. 

ఈనెల 2న  కొత్తగూడెం జిల్లాలో జరుగనున్న సీఎం టూర్ విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలపారు. దేశానికే తలమానికంగా ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఉంటుందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికంగా ఖనిజాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ మీడియా సమావేశంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, మీడియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.