
- జులై వరకు కేంద్రం2.10లక్షల టన్నులు కోతపెట్టింది: మంత్రి తుమ్మల
- అవన్నీ కలిపి ఈ నెలలోనేసరఫరా చేయండి
- ఆలస్యం చేస్తే పంటలపై ప్రభావం పడే ముప్పుందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆగస్టు నెలలో యూరియా వినియోగం అధికంగా ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని తగినంత సప్లయ్ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సరఫరాలో జాప్యం జరిగితే పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 1.09 లక్షల టన్నుల యూరియా నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, అయితే ఆగస్టు నెలలో కనీసం 3 లక్షల టన్నుల యూరియా అవసరమని మంత్రి అంచనా వేశారు. ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు రాష్ట్రానికి 6.60 లక్షల టన్నుల యూరియా సరఫరా కావాల్సి ఉండగా, కేవలం 4.51 లక్షల టన్నులు మాత్రమే అందాయని, ఈ కాలంలో 5.70 లక్షల టన్నుల యూరియా రైతులకు విక్రయించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.
ఆర్ఎఫ్సీఎల్ ద్వారా భర్తీ చేయండి
కేంద్రం ఆగస్టు నెలకు రాష్ట్రానికి 1.70 లక్షల టన్నుల యూరియా కేటాయించగా, ఇందులో 1.31 లక్షల టన్నులు దేశీయంగా, 0.39 లక్షల టన్నులు దిగుమతి ద్వారా సరఫరా చేయాల్సి ఉందన్నారు. అయితే, దిగుమతి యూరియా షిప్‌మెంట్ వివరాలు ఇంకా అందలేదని, దేశీయ సంస్థలైన పీపీఎల్ నుంచి 11 వేల టన్నులు, ఎంసీఎఫ్ఎల్ నుంచి 7 వేల టన్నులు సరఫరా చేయలేమని తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు.
ఏప్రిల్ నుంచి జులై వరకు 2.10 లక్షల టన్నుల యూరియా కేంద్రం కోత పెట్టిందన్నారు. ఈ కోత పెట్టిన యూరియాను ఆగస్టులో భర్తీ చేయాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు లెటర్ రాసినట్లు తెలిపారు. పీపీఎల్, ఎంసీఎఫ్ఎల్ నుంచి రావాల్సిన 18 వేల టన్నుల కొరతను ఆర్ఎఫ్సీఎల్ ద్వారా భర్తీ చేయాలని కోరారు.
దిగుమతి ద్వారా 39,600 టన్నుల యూరియాను ఆగస్టు20లోగా సరఫరా చేయాలని, అలాగే ఏప్రిల్- నుంచి జులై నెలలకు చేసే సరఫరాలో కోతపెట్టిన 2.10 లక్షల టన్నులు ఈ నెలలో కలిపి మంజూరు చేయాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో పంటలకు యూరియా లభ్యత నిరంతరం ఉండేలా కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.