- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏర్పాటు చేయనున్న మన్మోహన్‌సింగ్ ఎర్త్ యూనివర్సిటీ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. యూనివర్సిటీకి వచ్చే నెల 2న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో ఆదివారం కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఇతర ఆఫీసర్లతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ... భూమికి సంబంధించి అనేక పరిశోధనలకు ఈ యూనివర్సిటీ వేదిక కానుందన్నారు.
రాష్ట్రంతో పాటు దేశానికి ఉపయోగపడేలా యూనివర్శిటీని రూపొందిస్తున్నామని చెప్పారు. దేశంలోనే మొదటిదిగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి యూనివర్సిటీగా ఈ ఎర్త్ యూనివర్సిటీ నిలుస్తుందన్నారు. తన ఆలోచలనలకు కలెక్టర్ జితేశ్ రూపం తీసుకొచ్చారని, ఎర్త్ యూనివర్సిటీ సాధ్యాసాధ్యాలను సీఎం, ప్రత్యేక నిపుణులతో చర్చించాక ఫైనల్ చేశామన్నారు. సింగరేణితో పాటు పలు పరిశ్రమల సహకారంతో ఈ యూనివర్సిటీని అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. సీఎం పర్యటనను సక్సెస్ చేసేందుకు అన్ని శాఖల ఆఫీసర్లు కోఆర్డినేషన్‌తో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావ్, జారె ఆదినారాయణ, రాందాస్‌నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్‌శర్మ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పి. వీరబాబు, అడిషనల్ కలెక్టర్ డి.వేణుగోపాల్, కాంగ్రెస్ నాయకులు మోత్కూరి ధర్మారావు, బిక్కసాని నాగేశ్వరరావు, బాలశౌరి, బాలకృష్ణ పాల్గొన్నారు. అనంతరం రైతు సమస్యలపై సీపీఎం లీడర్లు మంత్రి తుమ్మలకు వినతిపత్రం అందజేశారు.
