
- రూ.700 కోట్లు బాకీపెట్టడం బాధాకరమని వ్యాఖ్య
- కంపెనీల ప్రతినిధులు, అగ్రికల్చర్ అధికారులతో మంత్రి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: జోగుళాంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను నెల రోజుల్లోగా చెల్లించాలని విత్తన కంపెనీలను వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సోమవారం సెక్రటేరియెట్లో పర్యాటక, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ గోపి, వివిధ సీడ్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. తుమ్మల మాట్లాడుతూ గద్వాల జిల్లాలో రైతులు దాదాపు 50 వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు సాగుచేసినా.. సంబంధిత కంపెనీలు ఇప్పటి వరకు చెల్లింపులు చేయలేదని స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు.
రైతుల సంక్షేమం ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని, వారికి ఎలాంటి అసౌకర్యం కలిగినా సహించబోమని స్పష్టం చేశారు. గద్వాల జిల్లా పత్తి విత్తన ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, ఇది దేశానికి తలమానికమని పేర్కొన్నారు. విత్తనాలు ఉత్పత్తి చేసి కంపెనీలకు సరఫరా చేసిన రైతులకు ఇప్పటి వరకు దాదాపు రూ.700 కోట్ల బకాయిలు చెల్లించకపోవడం విచారకరమని, వెంటనే స్పందించి నెల రోజుల్లో ఈ బకాయిలను చెల్లించాలని కంపెనీలను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సీడ్స్‌మెన్ అసోసియేషన్ ప్రతినిధులు రామకృష్ణ, ప్రవీణ్, వివిధ కంపెనీ ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.