
- పత్తికి ప్రస్తుతం ఇస్తున్న ఎంఎస్‌పీ సరిపోదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: పండించిన పత్తి మొత్తాన్ని కొంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇవ్వడం పట్ల రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే, పత్తి కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తుమ్మల తీవ్రంగా ఖండించారు. రేవంత్ సర్కారుపై ఆయన చేసిన ఆరోపణలన్ని అవాస్తవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ప్రతినిధులతో మూడు సార్లు చర్చలు జరిపిందని, టెండర్లలో జిన్నింగ్ మిల్లులు పాల్గొనేలా చొరవ తీసుకున్నట్టు వివరించారు. సీసీఐ, జిన్నర్లతో సమావేశాలు నిర్వహించి కొనుగోళ్ల అడ్డంకులను తొలగించేందుకు ప్రయత్నించామన్నారు. సీసీఐ ప్రతినిధులు.. టెండర్లు, జిన్నింగ్ మిల్లులతో ఒప్పందాలు, నోటిఫికేషన్ ప్రక్రియలను త్వరగా పూర్తి చేసి కొనుగోళ్లకు సిద్ధం కావాలని సూచించారు. రాష్ట్రంలోని పత్తి రైతులకు తేమ శాతంపై పూర్తి అవగాహన ఉందని, మార్కెటింగ్, వ్యవసాయ శాఖలు రైతులకు నిరంతరం సమాచారం అందిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
పత్తి మద్దతు ధరను పెంచాలి
ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన పత్తి మద్దతు ధర (ఎంఎస్‌పీ) రైతుల సాగు వ్యయాలకు సరిపోవడం లేదని తుమ్మల వెల్లడించారు. 2021, 2022ల్లో రైతులు ప్రైవేట్ మార్కెట్‌లో అమ్మిన ధర కంటే ప్రస్తుత ధర తక్కువగా ఉందన్నారు. 2010లోనే క్వింటాలుకు రూ.6000 ధర వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పెరిగిన ఉత్పత్తి వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత ఎంఎస్‌పీ సరిపోదని చెప్పారు. ఈ విషయంలో గత నెలలోనే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సీఏసీపీ) చైర్మన్‌కు లేటర్ కూడా పంపినట్లు తెలిపారు. కంది, పెసర, సోయాబీన్ వంటి పంటలపై విధించే 25% సీలింగ్ పరిమితిని కేంద్రం ఎత్తివేయాలని కోరారు. మొత్తం పంట సేకరణకు అనుమతించాలని డిమాండ్ చేశారు. అలాగే, మొక్కజొన్న, జొన్న పంటలను కూడా ఎంఎస్‌పీకి కొనుగోలు చేసేలా కేంద్రం ముందుకు రావాలన్నారు. ఈ విషయంలో కిషన్ రెడ్డి చొరవ చూపాలని కోరారు.