- రైతులు ఇబ్బందిపడ్తున్నరు: మంత్రి తుమ్మల
- ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితిపై కేంద్రం సమీక్షించాలి
- కేంద్ర జౌళి శాఖ అధికారులతో రివ్యూ
హైదరాబాద్, వెలుగు:
కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా పత్తి కొనుగోళ్లు బంద్ పెట్టిన జిన్నింగ్ మిల్లులు.. తమ సమ్మె వీడాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని కోరారు. రాష్ట్రంలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో కీలక సమీక్ష జరిగింది.
కేంద్ర జౌళి శాఖ సెక్రటరీ, ఉన్నతాధికారులతో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి తుమ్మల, జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. సీసీఐ కొనుగోళ్లకు కేంద్రం విధించిన తేమ నిబంధనలను సడలించాలని, ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొంటామన్న షరతును వెనక్కి తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఎకరానికి 11 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తామన్న కేంద్రం, ఇప్పుడు 7 క్వింటాళ్లకు తగ్గించడంతో మిగిలిన పత్తిని రైతులు ఎక్కడ అమ్ముకోవాలని తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధరతో కేవలం 25% పంట మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రం పెట్టిన నిబంధనతో పెసర్లు, కందులు, పొద్దుతిరుగుడు వంటి పంటలపై గతంలోనూ రైతులు నష్టపోయారని తెలిపారు.
జిన్నింగ్ మిల్లులను ఎల్ 1 నుంచి ఎల్ 2లుగా విభజించి కొనుగోళ్లను కేటాయించడం పట్ల మొదటి నుంచే తీవ్ర అభ్యంతరం వ్యక్తమైందని చెప్పారు. కొనుగోళ్లు ప్రారంభమై నెలరోజులు గడిచినా మొత్తం 325 మిల్లుల్లో కేవలం 243 మిల్లులకే కేటాయింపులు జరగడంతో మిగతా 82 మిల్లులు మూతపడే పరిస్థితి అని ఆందోళన వ్యక్తం చేశారు. సీసీఐతో మంగళవారం జరగబోయే చర్చల్లో జిన్నింగ్ మిల్లుల సమస్యలను వివరించి, సీఎం సూచనల మేరకు సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తామని తుమ్మల భరోసా ఇచ్చారు.
