10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నీళ్ల దోపిడీ నాలుగింతలు పెరిగింది: మంత్రి ఉత్తమ్ కుమార్

10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నీళ్ల దోపిడీ నాలుగింతలు పెరిగింది: మంత్రి ఉత్తమ్ కుమార్

నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం మొదలైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ సాధించిన విజయం అమరులది, సకల జనులదని.. అమరుల ఆశయాలు ఇంకా నెరవేరలేదన్నారు. 10 ఏళ్ల పాలనలో నీళ్ల దోపిడీ నాలుగింతలు పెరిగిందని చెప్పారు. అసెంబ్లీలో మేడిగడ్డ బ్యారేజ్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టారు. సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేశారు. ప్రాజెక్టు కుంగడానికి గల కారణాలను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ వివరించారు. 

సొంత ఇంజనీరింగ్ ప్లాన్లతో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్. కృష్ణా జిల్లాల్లో న్యాయమైన వాటా సాధించడంలో బీఆర్ఎస్ విఫలమైందని విమర్శించారు. కృష్ణా జిల్లాల్లో 299 టీఎంసీలకే అంగీకరించి అన్యాయం చేశారని తెలిపారు. పదేళ్లలో సరాసరి ఒక్కో ఎకరానికి 11 లక్షలు ఖర్చు పెట్టారని బీఆర్ఎస్ ని విమర్శించారు. 

ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండకు తీరని అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. మేడిగడ్డ పిల్లర్లకు నిట్టనిలువునా పగుళ్లు వచ్చాయని.. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లు కూడా కుంగే ప్రమాదం ఉందని చెప్పారు. 

వందేళ్లు అవుతున్నా నిజాంసాగర్ ప్రాజెక్టు పటిష్టంగా ఉందని.. నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు తెలంగాణకు వరప్రదాయిని అని చెప్పారు. కేఆర్ఎమ్ బీకి ప్రాజెక్టులు అప్పగించేందుకు బీఆర్ఎస్ అంగీకరించిందని తెలిపారు. కృష్ణా, గోదావరి ఆయకట్టను వీలైనంత పెంచేందుకు కృషి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారు.