- గడువులోగా వాటిని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రానికి భారీ అప్పుల భారం
- గత పదేండ్లలో రూ.1.81 లక్షల కోట్లను ఇరిగేషన్‌కు ఖర్చు పెట్టిన్రు
- ఒక్క కాళేశ్వరానికే రూ.97 వేల కోట్లు ఖర్చు పెట్టిన్రని విమర్శ
హైదరాబాద్, వెలుగు: కృష్ణా బేసిన్‌కు చెందిన అన్ని సాగు నీటి ప్రాజెక్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, గడువుల్లోనే వాటన్నింటినీ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్ల రాష్ట్రంపై భారీ అప్పుల భారం పడిందన్నారు. రూ.1.81 లక్షల కోట్లను నీటి పారుదల రంగంపై ఖర్చు చేసినప్పటికీ, వాటిలో అత్యధికంగా కాళేశ్వరం ప్రాజెక్టుకే మళ్లించిందని విమర్శించారు. పాలమూరు-– రంగారెడ్డి లిఫ్ట్ పథకంలో ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు సృష్టించలేదన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు కార్పొరేషన్ల ద్వారా రూ.97,000 కోట్లను అధిక వడ్డీ, తక్కువ గడువు రుణాలుగా తీసుకొచ్చిందని, ప్రస్తుతం రూ.82,000 కోట్ల భారం మిగిలిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రూ.41,000 కోట్ల మూలధనం, రూ.16,000 కోట్ల వడ్డీ చెల్లించిందన్నారు. ఇప్పుడు అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ, దీర్ఘకాల రుణాలతో భర్తీ చేస్తూ అభివృద్ధి పనులకు నిధులు మళ్లిస్తున్నామని చెప్పారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో వేగం..
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమని మంత్రి ఉత్తమ్ అన్నారు. 2028 జూన్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సాగు నీటి ప్రాజెక్టులకు భూసేకరణ, పునరావాసం, పునర్వ్యవస్థీకరణ కోసం ప్రత్యేకంగా రూ.5,000 కోట్ల ప్యాకేజీ మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని 2026 జూన్ 2 నాటికి విడుదల చేస్తామన్నారు. గత ప్రభుత్వం రూ.5,000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులో హెడ్‌వర్క్స్ కూడా ఖరారు చేయలేదన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం యాదుల డిండి లింక్‌కు రూ.1,800 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిచిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలతో పాటు పాత నల్గొండ జిల్లాకు సాగు నీరు అందించనున్నట్లు వెల్లడించారు. రెండేండ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
సన్న బియ్యం పథకం చరిత్రాత్మక నిర్ణయం..
రాష్ట్రంలో సన్న బియ్యం పథకం దేశంలోనే చరిత్రాత్మక నిర్ణయమని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 86 శాతం మంది పేద వర్గాలకు రూ.14,532 కోట్లు ఖర్చు చేసి, దాదాపు 3.39 కోట్ల మంది లబ్ధిదారులకు నెలకు 6 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఇది రాష్ట్ర జనాభాలో 86 శాతం మందిని కవర్ చేస్తోందని చెప్పారు.
గతంలో 89 లక్షల కార్డులకు 2.81 కోట్ల మందికి రూ.10,641 కోట్లు ఖర్చు చేసి దొడ్డు బియ్యం ఇస్తే, ప్రజలు వాటిని వినియోగించుకోలేదన్నారు. మరోవైపు, రాష్ట్రంలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదని మంత్రి తెలిపారు. కమర్షియల్, ఆటో గ్యాస్ కొరత ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు త్వరలో పూర్తిస్థాయిలో సరఫరాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వం రోజువారీగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
