ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవించాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవించాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • కన్హా శాంతి వనం సెమినార్​లో  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

షాద్ నగర్, వెలుగు: కన్హా శాంతి వనానికి రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రపంచ ప్రమాణాలకు తగినట్టుగా ఈ వనం ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ జీవితంలో శాంతియుతంగా, సామరస్యంగా జీవించాలని మంత్రి సూచించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా శాంతి వనంలో శనివారం ఇంటెర్నేషల్ యూత్ కైండ్ నెస్ సెమినార్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, షాద్‌‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జాయెద్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ డిప్యూటీ చైర్మన్ హమ్దాన్ అల్ షార్ జాయెద్, దక్షిణాసియా, ప్రపంచ బ్యాంకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ రైజర్, కామన్వెల్త్ సెక్రటేరియట్​లో సలహాదారు సుశీల్ రామ్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాలుష్యం, ఆర్థిక క్షీణత, అనేక జాతులు తుడిచిపెట్టుకుపోవడం వంటి ప్రపంచంలోని ప్రధాన సమస్యలకు 21వ శతాబ్దపు మానవజాతే కారణమని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ఇతరుల దృక్కోణాల పట్ల, ఇతరుల నమ్మకాల పట్ల మరింత అసహనం పెరుగుతోందన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ శాంతియుతమైన, సామరస్యపూర్వకమైన జీవితాన్ని గడపడానికి హార్ట్ ఫుల్ నెస్ సహాయపడుతోందని కొనియాడారు. దాజీ అద్భుతమైన పనిని తాను అభినందిస్తున్నానని తెలిపారు.