
- లబ్ధిదారులకు మూడు నెలల తర్వాత సన్నబియ్యం పంపిణీ
- డిసెంబర్ నాటికి 2,164 ఇండ్ల పంపిణీ పూర్తి చేస్తాం
- మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హుజూర్‌నగర్, వెలుగు : అర్హులైన ప్రతిఒక్కరికీ త్వరలో కొత్త తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కొత్త కార్డులు మంజూరు చేసేందుకు ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో విధి విధానాలు రూపొందించినట్లు తెలిపారు. కార్డుదారులందరికీ మూడు నెలల తర్వాత సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. అలాగే సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చేందుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డితో కలిసి ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని మంత్రి క్యాంప్ ఆఫీస్‌లో రోడ్లు, భవనాలు, పంచాయతీ, విద్యుత్‌శాఖ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. తాను గతంలో మంత్రిగా పనిచేసిన టైంలో హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 35, కోదాడ నియోజకవర్గంలో16 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లు ప్రారంభించామని, ప్రస్తుతం అవి సరిగా పనిచేయడం లేదన్నారు. లిఫ్ట్‌లను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చే విషయంపై చర్చించేందుకు సోమవారం కోదాడలో ఇరిగేషన్ ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. లిఫ్ట్‌ల రిపేర్లకు కావాల్సిన నిధులను మంజూరు చేయిస్తానని చెప్పారు. కోదాడ నియోజకవర్గంలోని సాగర్ లెఫ్ట్ కెనాల్ పైన ఉన్న లిఫ్ట్‌ల మెయింటెనెన్స్‌ను ప్రభుత్వమే చూస్తుందని 2014లో ప్రకటించిన కేసీఆర్ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదన్నారు. లిఫ్ట్ మెయింటెన్స్‌కోసం ప్రతి నాలుగు లిఫ్ట్‌లకు ఆపరేటర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ సిబ్బందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించి, వారికి ట్రైనింగ్ ఇస్తామని, ప్రాజెక్టుల వద్ద 24 గంటల సెక్యూరిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
సింగిల్ బెడ్‌రూం ఇండ్లను బీఆర్‌ఎస్ పట్టించుకోలే
హుజూర్‌నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన హౌసింగ్ పనులను మంత్రి పరిశీలించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన 2,164 సింగిల్ బెడ్‌రూం ఇండ్లను బీఆర్‌ఎస్ పట్టించుకోలేదని విమర్శించారు. డిసెంబర్ నాటికి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఆఫీసర్లు రాజేశ్వర్‌రెడ్డి, భాస్కర్‌రావు, రమేశ్, విద్యుత్ శాఖ ఆఫీసర్లు పాల్‌రాజ్, వెంకట కృష్ణ, పంచాయతీరాజ్ ఆఫీసర్లు రామకృష్ణ,వెంకటయ్య పాల్గొన్నారు.
పనుల్లో రాజీ పడొద్దు
కోదాడ, హుజూర్‌నగర్ నియోజక వర్గాల్లో మంజూరు చేసిన పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా, క్వాలిటీతో చేపట్టాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. రెండు నియోజకవర్గాల పరిధిలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 85 కొత్త పనులతో పాటు, రెన్యూవల్ వర్క్స్ కోసం రూ. 124.65 కోట్లు మంజూరు చేయించినట్లు చెప్పారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 35 రహదారుల నిర్మాణానికి రూ. 267 కోట్లు, కోదాడ నియోజకవర్గంలో 7 రోడ్ల నిర్మాణానికి రూ. 156 కోట్లు మంజూరు అయినట్లు ప్రకటించారు. రెండు నియోజకవర్గాల్లో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు రూ. 15 కోట్లు, సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు రూ. 5 కోట్లు, అడిషనల్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు రూ. 1.8 కోట్లు, విద్యుత్ కెపాసిటీ పెంచేందుకు రూ. 1.7 కోట్లు మంజూరు చేశామని మంత్రి చెప్పారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలని సూచించారు.