
హైదరాబాద్, వెలుగు:కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై వేసిన జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చిన 650 పేజీల రిపోర్టుపై స్టడీ చేసేందుకు ఇప్పటికే కమిటీ వేసినట్టు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆదివారం ఆ కమిటీతో సమావేశం అవనున్నట్టు తెలిపారు. సోమవారం కేబినెట్ ముందు పెట్టాల్సిన అంశాలపై ఆ మీటింగ్‌లో చర్చిస్తామని చెప్పారు. శనివారం ఆయన సెక్రటేరియెట్‌లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. లోకేశ్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఏపీ చేపడుతున్న పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టును అన్ని రకాలుగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
బనకచర్ల ప్రాజెక్టును ఆపాలంటూ తానే స్వయంగా కేంద్రానికి లేఖలు రాశానని, తమ స్టాండ్ చాలా క్లియర్‌గా ఉందని పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టును ఇప్పటికే పర్యావరణ శాఖ, గోదావరి బోర్డు, పీపీఏ, సెంట్రల్ వాటర్ కమిషన్లు వ్యతిరేకించాయన్నారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంతో టీడీపీ భాగస్వామిగా ఉందని నారా లోకేశ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, ఎన్డీఏతో పొత్తు ఉందని ఏదిపడితే అది మాట్లాడితే కుదరదన్నారు. బనకచర్ల ప్రాజెక్టుకు తాము వ్యతిరేకమని, దానిపై ఎంతటి పోరాటానికైనా సిద్ధమని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ పబ్లిసిటీ కోసమే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నదన్నారు.