
- ..కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు మంత్రి ఉత్తమ్ లేఖ
- ఏపీ జల దోపిడీని అడ్డుకోవాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా, గోదావరి నదీ బేసిన్లలో సమస్యలపై కేంద్రం వెంటనే చొరవచూపాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. పాలమూరు-– రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు ఇప్పటికీ క్లియరెన్స్ రాలేదని, వాటికి వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. కృష్ణా బేసిన్లో శ్రీశైలం నుంచి ఇతర బేసిన్లకు ఏపీ అక్రమంగా నీటిని మళ్లిస్తున్నదని, అడ్డుకోవాలని మంత్రి ఉత్తమ్ ఫిర్యాదు చేశారు.
ఏపీ ప్రభుత్వం తుంగభద్ర నీటిని కేసీ కెనాల్ నుంచి హై లెవెల్, లో లెవెల్ కాల్వలకు నీటిని తరలించడం బచావత్ ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘించడమే అవుతుందని తెలిపారు. బచావత్ అవార్డు మేరకు 1979లో ఎస్ఎల్బీసీ, 1984లో మొదలైన కల్వకుర్తి, 1997లో నెట్టెంపాడు, 2013లో పాలమూరు రంగారెడ్డి, 2007లో డిండి, 2005లో కొల్లాపూర్, 2014లో నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని, వాటికి సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాలనుకున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టు కు కేంద్రం సహకరించాలని కోరారు. తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అవసరాలు తీర్చేందుకు 200 టీఎంసీల వరద నీటిని ఉపయోగించుకునేలా ఇచ్చంపల్లి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని డిమాండ్ చేశారు. గోదావరిపై పోలవరం, ఇచ్చంపల్లి ప్రాజెక్టులు చేపట్టాలని గోదావరి ట్రిబ్యునల్ పేర్కొందని, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు సమకూర్చుతున్నందున, అంతే సమానంగా ఇచ్చంపల్లి ప్రాజెక్ట్‌కు కేంద్రం నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు.