
- నిధులు, ప్రక్రియ, ప్రణాళికలపై పూర్తి వివరాలివ్వండి
- సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోండి
- డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటితో కలిసి రివ్యూ
హైదరాబాద్, వెలుగు: సీతారామ ప్రాజెక్టులో ఉన్న సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టులోని అన్ని ప్రాంతాల్లో అవసరమున్నచోట భూసేకరణను వేగవంతం చేయాలన్నారు. అటవీ అనుమతులు, టన్నెల్ నిర్మాణాలనూ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. అధికారులు ప్రాజెక్టులో ఉన్న సమస్యలు, భూసేకరణ ఇబ్బందులు, మొత్తం ఖర్చు, ప్రాజెక్టు పనుల పురోగతి గురించి తనకు వ్యక్తిగతంగా వివరించాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టు భూసేకరణకు ఉన్న ఇబ్బందులు అన్నింటిపైనా తనకు పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించారు.
భూసేకరణకు కావాల్సిన నిధులు, ప్రక్రియ, ప్రణాళికలేంటో చెప్పాలని, ఆ విషయాలను తాను చూసుకుంటానని స్పష్టం చేశారు. అధికారులు ఫీల్డ్‌లో ఉండి పనిచేయాలని, పనులు చేయడానికి ఇదే సరైన సమయమని తేల్చి చెప్పారు. శనివారం జలసౌధలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి సీతారామసాగర్ ప్రాజెక్టుపై మంత్రి సమీక్ష చేశారు. ఈ రివ్యూకు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులు మంత్రులకు వివరించారు.
సీతారామ లిఫ్ట్ ప్రధాన కాల్వ పనులు 97 శాతం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే మూడు ప్రధాన పంప్‌హౌస్‌లకు వెట్‌రన్‌ను విజయవంతంగా పూర్తి చేశామని, నాలుగో పంప్‌హౌస్ పనులు పూర్తి కావొచ్చాయని అధికారులు వివరించారు. పాలేరు లింక్ కెనాల్, సత్తుపల్లి ట్రంక్ కెనాల్, ఎంకూరు లింక్ కెనాల్పనులు కొనసాగుతున్నాయని, వీటి విషయంలోనే భూసేకరణ, అటవీ అనుమతులు, టన్నెల్ నిర్మాణాలపై సమస్యలున్నాయని వివరించగా.. వాటి గురించి అన్నీ వివరంగా చెబితే తాను చూసుకుంటానని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. నెల తర్వాత మరోసారి దీనిపై రివ్యూ చేస్తానని చెప్పారు.
లైన్ డయాగ్రమ్‌ను పరిశీలించిన ఉత్తమ్
రివ్యూలో భాగంగా ప్రాజెక్ట్ లైన్ డయాగ్రమ్‌ను పరిశీలించిన మంత్రి ఉత్తమ్.. నీటి ప్రవాహానికి ఎక్కడ అడ్డంకులున్నాయో అడిగి తెలుసుకున్నారు. 80 నుంచి 90 ఎకరాల అటవీ ప్రాంతంలో టన్నెల్‌ను నిర్మించాల్సి వస్తున్నదని, వాటి పనులను ఇంకా మొదలుపెట్టాల్సి ఉందని అధికారులు చెప్పారు. కాగా, రివ్యూకు హాజరైన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య.. ఇల్లందుకు తాగునీటి సరఫరా లేదని ఫిర్యాదు చేశారు.
నీటి సరఫరా చేయాలని కోరగా.. మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం ఉన్న డిజైన్‌లో మార్పులు చేయకుండా.. ఇల్లందుకు నీళ్లిచ్చే లింక్ కెనాల్ నిర్మాణంపై ఓ సారి పరిశీలన జరపాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ప్రాధాన్య క్రమంలో పేమెంట్లు
కాంట్రాక్టర్లకు ప్రాధాన్య క్రమంలో పేమెంట్లు చేయాలని, పేమెంట్లపై నోట్ ఇవ్వాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. దాని ఆధారంగా ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. ప్రాజెక్టును ప్రాధాన్యపరంగా పూర్తి చేయాలన్నారు. సీతమ్మసాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్‌నూ వేగంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు పెండింగ్‌లో ఉన్న అటవీ పర్యావరణ అనుమతులను తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో అనుమతులు లేకుండానే కొన్ని పనులు చేశారని, ఫలితంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.53.41 కోట్ల జరిమానా విధించిందని గుర్తు చేశారు.
ఆ జరిమానాను రద్దు చేయించేందుకు ఉన్న చట్టపరమైన వ్యూహాలపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టులో హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు కూడా ఉందని, 282.8 మెగావాట్ల సామర్థ్యంతో పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఇప్పటికే జెన్కోకు ప్లాన్ ఇచ్చామని, దానిపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. పాలేరు కెనాల్ వద్ద టన్నెల్ పనులను దగ్గరుండి పర్యవేక్షించాల్సిందిగా అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.