సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది : మంత్రి వాకిటి శ్రీహరి

సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది : మంత్రి వాకిటి శ్రీహరి
  •     మంత్రి వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి

తొర్రూరు, వెలుగు : అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్​లో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. 

గత ప్రభుత్వ పదేండ్ల అహంకారాన్ని పది రోజుల్లో దించిన ఘనత పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని, ఝాన్సీ రెడ్డిదన్నారు. ప్రజా ప్రభుత్వానికి మరింత బలం చేకూరాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు ఉన్నట్లే పార్టీలో కూడా ఉంటాయని, వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్లాలన్నారు. పాలకుర్తి ప్రజల చేతిలో ఓడిపోయిన మాజీ మంత్రి దయాకర్ రావు పాలకుర్తిలో బీఆర్ఎస్ బలపడుతుందని మాట్లాడుతున్నాడని, మచ్చలేని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. 

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోనే కలిసి పనిచేస్తామని సీపీఎం, సీపీఐ పార్టీల నాయకులు మద్దతు పలకడం అభినందనీయమన్నారు. తొర్రూరులో 16 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. అనంతరం పాలకుర్తి నియోజకవర్గంలో మినీ స్టేడియం మంజూరు చేయాలని మంత్రి వాకిటి శ్రీహరికి ఎమ్మెల్యే కోరాగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. సమావేశంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రు నాయక్, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్, ముత్తినేని సోమేశ్వరరావు, హమ్యా నాయక్, మేకల కుమార్, సోమ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.