ఆమనగల్లు, వెలుగు: మున్సిపాలిటీల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆమనగల్లులో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బుధవారం ఆమనగల్లు మున్సిపాలిటీలోని 7, 8వ వార్డుల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళా సంఘాల సభ్యులు చనిపోతే బ్యాంకు వారిని తీసుకొచ్చి రుణం కింద ఇండ్లు జప్తు చేశారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీతో ఆమనగల్లు ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాయకులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, గుర్రం కేశవులు, హనుమ నాయక్, యాట నరసింహ, రవికాంత్ గౌడ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు ఇండ్లు నిర్మించడమే లక్ష్యం
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : రాష్ట్రంలోని నిరుపేదలకు ఇండ్లు నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేండ్లపాటు ప్రజా సమస్యలను గాలికొదిలేసిన బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లడిగేందుకు రావడం సిగ్గుచేటన్నారు.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు పట్టం కట్టాలని కోరారు. నియోజకవర్గంలో రూ.1,000 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. రైతులకు బోనస్ ఇచ్చి అండగా నిలిచామని పేర్కొన్నారు.
