
- ఢిల్లీలో మంత్రి వాకిటి, విప్ ఆది శ్రీను
న్యూఢిల్లీ, వెలుగు: బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీలో చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బీసీ రిజర్వేషన్ల పోరాటం.. మరో తెలంగాణ ఉద్యమంగా రూపం దాల్చబోతున్నదని చెప్పారు. బుధవారం జరగనున్న బీసీ ధర్నాలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన వాకిటి శ్రీహరి.. మంగళవారం తెలంగాణ భవన్‌లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవద్దని, బీసీల నోటిదాకా వచ్చిన ముద్దను దూరం చేయొద్దని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును కోరారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. అసెంబ్లీలో రిజర్వేషన్లకు సై అన్న బీజేపీ ఎమ్మెల్యేలు.. ఢిల్లీలో నై అంటున్నారని ఎద్దేవా చేశారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే కాంగ్రెస్ కుల గణన చేసిందన్నారు.