ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో.. నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు : మంత్రి వాకిటి శ్రీహరి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో.. నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు :  మంత్రి వాకిటి శ్రీహరి
  • హౌసింగ్​​అధికారులపై మంత్రి వాకిటి సీరియస్

మక్తల్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నిర్లక్షం చేస్తే సహించేది లేదని మంత్రి వాకిటి శ్రీహరి హెచ్చరించారు. సోమవారం ఎంపీడీవో ఆఫీస్​లో నియోజకవర్గంలోని మున్సిపల్​ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పంచాయతీ సెక్రటరీలు, ఇంజనీర్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని స్పీడప్​ చేయాలని, లబ్ధిదారులు ఇసుక తీసుకెళ్లేందుకు అధికారులు సహకరించాలని సూచించారు. 

ఇసుక కొరత పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఈ సమస్యను అధిగమించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మంత్రి ఫైర్​ అయ్యారు. వారం రోజుల్లో మరోసారి సమేవేశం నిర్వహిస్తానని, పురోగతి కనిపించాలని సాకులు చెప్పవద్దని సూచించారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరైతే, సగం కూడా పూర్తి చేయకుంటే ఎలాగని నిలదీశారు. నియోజకవర్గానికి మరో 4 వేల ఇండ్లు మంజూరు చేయాలని సంబంధిత మంత్రితో మాట్లాడుతుంటే, ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి ఇలా ఉందని అసహనం 
వ్యక్తం చేశారు.

మెరుగైన సేవలు అందించాలి

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీజీ ఎస్పీడీసీఎల్​ సమకూర్చిన ఎమర్జెన్సీ సర్వీస్​ వెహికల్​ను మంత్రి ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో విద్యుత్  శాఖ అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి సేవలందించాలని సూచించారు. అంతకుముందు ఎంపీడీవో ఆఫీస్​లో వినాయక నిమజ్జనంలో సేవలందించిన సిబ్బందిని సన్మానించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు. బాలకిష్టారెడ్డి, గడ్డంపల్లి హన్మంతు, రవికుమార్, గణేశ్​​ కుమార్, వెంకటేశ్​ పాల్గొన్నారు