ఎంపీ అర్వింద్ అబద్ధాలు అడుతున్నరు

ఎంపీ అర్వింద్ అబద్ధాలు అడుతున్నరు

రాష్ట్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి కేంద్రం అమలు చేస్తుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో... డబుల్ బెడ్ రూం ఇండ్లలోనూ  కేంద్రం వాటా ఏమీ లేదన్నారు.  ఎఫ్ఆర్ బీఎంకి మించి అప్పులు చేస్తున్నామని అనవసరంగా బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో 50 ఏండ్లలో రూ.62 లక్షల కోట్ల అప్పు ఉంటే.. మోడీ ప్రధాని అయ్యాక రూ.87 లక్షల కోట్ల అప్పు చేశారని చెప్పారు. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఫెయిల్యూర్ అయ్యారని..దేశం ఆర్థికంగా కుంగిపోయిందన్నారు. నిర్మలా  హయాంలో జీడీపీ విలువ, రూపాయి విలువ పడిపోయిందన్నారు. 

బీజేపీ ఎంపీ అర్వింద్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు తీసుకువస్తామని రైతులకు ఇచ్చిన హామీ ఏమైందో ఎంపీ  సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం లేదన్నారు. తాను ఆర్ అండ్ బీ మంత్రిగా ఉండటం వల్లనే మాధవ నగర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు లభించాయని..పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. మాధవ నగర్ ఆర్వోబీ లో రూ.93 కోట్లు ఖర్చు ఉంటే కేంద్రం ఇచ్చేది కేవలం రూ.30 కోట్లు మాత్రమే అన్నారు. ..

ప్రధాని మోడీ వైఫల్యాలను సీఎం కేసీఆర్ ఒక్కరే నిలదీస్తున్నారని..అందుకే కేంద్ర మంత్రులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ముఖ్యమంత్రి ఒక్కరే ఒంటరి పోరాటం చేస్తున్నారన్నారు. కేసీఆర్ ను చూసి కేంద్రం, బీజేపీ భయపడుతుందన్నారు. తెలంగాణ పర్యటన పేరుతో కేంద్ర మంత్రులు రాష్ట్రంలో తిరుగుతున్నారని..వాళ్లంతా కేసీఆర్ ని దూషించడం తప్ప వారు చేసేదేమీ లేదన్నారు. 

మోడీని గద్దె దించడమే  కేసీఆర్ లక్ష్యంగా పనిచేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.  నిర్మలా  సీతారామన్ మోడి ఫొటో పెట్టమని కలెక్టర్ ని నిలదీయటానికే తెలంగాణ వచ్చారా అన్ని ప్రశ్నించారు. కేంద్రానికి అధికంగా పన్ను లు కడుతున్న రాష్ట్రం తెలంగాణే అన్నారు. ఆ డబ్బుతో మిగతా రాష్ట్రాల్లో కేంద్రం అభివృద్ధి పనులు చేస్తుందన్నారు. తెలంగాణ సొమ్మును ఖర్చు చేస్తున్న ఆయా రాష్ట్రాల్లో కేసీఆర్ ఫొటో పెడతారా అని నిలదీశారు. ఫొటోల పంచాయతీ ఎందుకో కేంద్ర ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలన్నారు.