- మాజీ సీఎం కేసీఆర్పైమంత్రి వెంకట్‌రెడ్డి ఫైర్
నల్గొండ, వెలుగు : మాజీ సీఎం కేసీఆర్ పనికిమాలిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రూ.7 లక్షల కోట్లు అప్పు చేసిండని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. గత పదేండ్లు ఫామ్‌హౌజ్, ప్రగతి భవన్‌కు పరిమితమై.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని ఆయన మండిపడ్డారు. శుక్రవారం నల్గొండ, నార్కట్‌పల్లి మండలంలో మంత్రి పర్యటించారు. ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి జయశంకర్ బడిబాట కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద పిల్లల చదువుల కోసం కేసీఆర్ ఏనాడూ ఆలోచించలేదని విమర్శించారు. రాష్ట్రానికి పదేండ్లు పట్టిన పీడ విరగడైందన్నారు. దక్షిణ తెలంగాణపైన చిన్నచూపు చూసిన కేసీఆర్‌కు ప్రజలు ఎంపీ ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పారని అన్నారు.
రాష్ట్రంలో మల్లారెడ్డి, అనురాగ్కాలేజీ, గురునానక్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, వీటిపైన చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష ఎకరాలకు నీళ్లు అందించే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కడితే కోమటిరెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తదని కేసీఆర్నిధులు మంజూరు చేయలేదన్నారు. ప్రాజెక్టుకు ఎంత ఖర్చయినా పెట్టి పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, వచ్చే మూడు నెలల్లో ప్రాజెక్టును కంప్లీట్ చేసి సీఎం చేతుల మీదుగానే ప్రారంభం చేయిస్తానని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసి.. నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం రూ.600 కోట్లు విడుదల చేసిందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పనులు చేపట్టడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.