
హైదరాబాద్: కల్చర్‌ను కాపాడుకోవాలని.. కల్చర్ బాగుంటేనే మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తామన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. శనివారం (జూలై 19) హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్శటీలో 2024 ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై.. విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు.
మొత్తం 12 రంగాల్లో విశేషమైన సేవలు అందించిన వారికి అవార్డులు అందజేసిన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు యూనివర్సిటీ వాళ్ళు చాలా చిన్న విషయాలను గుర్తించి అవార్డులు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. మేం వీ6 ఛానెల్ పెట్టినప్పుడు ఛానెల్ లోగో ఏది పెట్టాలని చాలా ఆలోచన చేశామని.. ఎందుకంటే ఆకర్షణీయమైన లోగో ఉంటే పబ్లిక్‌తో మంచి కనెక్టవిటీ ఏర్పడుతుందన్నారు.
అందుకే సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీకి మంచి లోగో తయారు చేసినందుకు లక్క నరేందర్‌కు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు మంత్రి వివేక్. తాను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నప్పటికీ.. రాజకీయాల వల్ల తెలుగుతో అనుబంధం పెరిగిందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళను ఏకం చేయడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు మంత్రి వివేక్.