- హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం
- రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది గిగ్ రంగంలో పనిచేస్తున్నరు
- కనీస వేతనం లేక, బీమా అందక అరిగోస పడ్తున్నరు
- అందుకే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
- చట్టానికి సంబంధించి ఇప్పటికే
- డ్రాఫ్ట్ బిల్లు విడుదల చేసినట్టు స్పష్టీకరణ
హైదరాబాద్, వెలుగు:
గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు వారికి సామాజిక భద్రత కల్పించేలా చట్టం చేస్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. ఈ చట్టానికి సంబంధించి ఇప్పటికే డ్రాప్ట్ బిల్లును విడుదల చేశామన్నారు. గిగ్ ఎకానమీలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండడం శుభపరిణామమని, వారి సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు.
సోమవారం (డిసెంబర్ 08) గ్లోబల్ సమిట్‌లో భాగంగా కార్మికశాఖపై జరిగిన ప్యానల్ చర్చలో పారిశ్రామికవేత్తలకు.. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివేక్ వెంకటస్వామి వివరించారు. ప్యానల్లో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రతినిధి రంజిత్ ప్రకాశ్, ఉబర్ సంస్థ ప్రతినిధి మేఘా సింగ్, ఓమీ ఫౌండేషన్ ప్రతినిధి ఐశ్వర్య రామన్, గిగ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధి సలావుద్దీన్ పాల్గొన్నారు.
“ స్విగ్గీ, జొమాటో, ఊబర్, ర్యాపిడో.. ఇలా యాప్ ఓపెన్ చేస్తే చాలు సేవలు మన ముంగిట్లోకి వస్తున్నాయి. కానీ, ఆ సేవలను మోసుకొస్తున్న డెలివరీ బాయ్స్, డ్రైవర్ల బతుకులు మాత్రం రోడ్డుపాలవుతున్నాయి. ‘పార్ట్నర్స్’ అనే పేరుతో కంపెనీలు చేతులు దులుపుకుంటుంటే.. కనీస వేతనం లేక, బీమా అందక గిగ్ వర్కర్లు అరిగోస పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరి సంక్షేమం కోసం చట్టం తీసుకొస్తున్నది” అని ఆయన వివరించారు.
రాష్ట్రంలో 4 లక్షల మంది గిగ్ వర్కర్లు
డిజిటల్ ఎంప్లాయిమెంట్‌లో హైదరాబాద్ టాప్ గేర్‌లో ఉందని, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల నుంచి 4 లక్షల మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి గుర్తు చేశారు. వీరి కష్టాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం.. కేరళ తరహాలో ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పనిచేస్తున్న గిగ్ వర్కర్లందరి వివరాలతో సమగ్ర డేటాబేస్ రెడీ చేస్తున్నామని చెప్పారు.
రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో డెలివరీ బాయ్స్‌కు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పించడంపై దృష్టి పెట్టామన్నారు. కంపెనీలు, వర్కర్ల మధ్య సయోధ్య కుదిర్చేలా, ఇద్దరికీ ఆమోదయోగ్యమైన ఎకో సిస్టమ్ కోసం రాష్ట్ర స్థాయి చట్టం రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. ‘‘డిజిటల్ విప్లవం కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదని, వారికి సామాజిక భద్రత కల్పించడం బాధ్యత మాత్రమే కాదని అవసరమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది” అని పేర్కొన్నారు
విదేశాల్లో మనోళ్లకు ఏడాదిలో 20 వేల జాబ్స్
తెలంగాణ యువతకు విదేశాల్లోనూ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రణాళికలు రచిస్తున్నదని, వచ్చే ఏడాది కాలంలో కనీసం 20 వేల మంది నిరుద్యోగులను విదేశీ ఉద్యోగాలకు పంపించడమే టార్గెట్‌గా ‘టామ్‌కామ్’ పనిచేస్తున్నదని వివేక్ ప్రకటించారు. విదేశాల్లో మన వారికి మంచి డిమాండ్ ఉందని, కేవలం సరైన స్కిల్స్, భాషా నైపుణ్యం లేకపోవడం వల్లే అవకాశాలు కోల్పోతున్నామని అన్నారు. అందుకే స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు. టామ్‌కామ్ ఆధ్వర్యంలో విదేశీ భాషల్లో శిక్షణ ఇస్తున్నామని, పార్టనర్ ఏజెన్సీలతో కలిసి లెవల్-2 స్థాయి వరకూ భాషా నైపుణ్యాలను పెంపొందిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో గత పదేండ్లలో ఐటీఐలు పట్టించుకున్న నాథుడే లేడని వివేక్ అన్నారు.
ఐటీఐలను ఆధునీకరిస్తున్నం
ప్రస్తుతం తమ ప్రభుత్వం ఐటీఐలను ఆధునీకరించి, రాష్ట్రవ్యాప్తంగా 115 ‘అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు)’గా మారుస్తున్నదని వివేక్ తెలిపారు. టాటా టెక్నాలజీస్ సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్ల ద్వారా ఏటా సుమారు 2 లక్షల మందికి శిక్షణ ఇస్తామని, తద్వారా వారు ఇక్కడ లేదా విదేశాల్లో సులభంగా ఉద్యోగాలు పొందే వీలుంటుందని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే 540 మంది ట్రైనర్లను నియమించామని, ఈ ఏడాది అడ్మిషన్లు 99 శాతం పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు.
2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే తమ లక్ష్యమని.. ఇందుకోసం పారిశ్రామిక విధానాలను సులభతరం చేశామని, లేబర్ పాలసీలు ఫ్రెండ్లీగా ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ సోనాల్ మిశ్రా, రాష్ట్ర కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురు అతిథులను మంత్రి వివేక్ సన్మానించారు.
