దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించం..ఖర్గే హాజరైన వేదిక శుద్ధీకరణ దారుణం

దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించం..ఖర్గే హాజరైన వేదిక శుద్ధీకరణ దారుణం
  • ఖర్గే హాజరైన వేదిక శుద్ధీకరణ దారుణం: డిప్యూటీ సీఎం భట్టి 
  • కాంగ్రెస్‌‌‌‌తోనే బలహీన వర్గాలకు రక్షణ: మంత్రి వివేక్  
  • దేశవ్యాప్తంగా దళితులంతా ఏకం కావాలని పిలుపు 
  • హల్ద్వానీ ఘటనపై కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ నేతల ఆగ్రహం
  • ఢిల్లీలో ‘దళిత, ఆదివాసీ ఆత్మగౌరవ సదస్సు’ 

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌తోనే బలహీన వర్గాలకు రక్షణ లభిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో మనుధర్మ శాస్త్రం పేరుతో బలహీన వర్గాలపై దాడి జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా దళితులు ఏకం కావాలని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్‌‌‌‌లోని హల్ద్వానీలో ఇటీవల ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ర్యాలీ అనంతరం జరిగిన ‘శుద్ధీకరణ’కు వ్యతిరేకంగా మంగళవారం ఢిల్లీలోని కాన్‌‌‌‌స్టిట్యూషన్ క్లబ్‌‌‌‌లో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం, పార్టీ ఎస్సీ, ఎస్టీ విభాగాల ఆధ్వర్యంలో ‘దళిత, ఆదివాసీ ఆత్మగౌరవ సదస్సు’ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల జాతీయ సమన్వయకర్త రాజు, ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్, ఏఐసీసీ ఎస్టీ విభాగం జాతీయ చైర్మన్ విక్రాంత్ భూరియా ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో తెలంగాణ నుంచి మంత్రులు వివేక్ వెంకటస్వామి, సీతక్క, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్ తదితరులు పాల్గొన్నారు. 

లోక్‌‌‌‌సభ, రాజ్యసభ కాంగ్రెస్ ఎంపీలు, మాజీ ఎంపీలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ శాసనసభ్యులు, ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ విభాగాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఖర్గే హాజరైన వేదికను శుద్ధి చేయడాన్ని సదస్సుకు హాజరైన నేతలంతా తీవ్రంగా వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న వివక్ష, హింసాత్మక ఘటనలపై చర్చించారు. దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాలపై వివక్ష, హింసను అడ్డుకునేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీలతో పాటు ప్రతి పౌరుడికి ఆత్మగౌరవం, హుందాతనం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం హక్కులను కల్పించిందని గుర్తు చేశారు. పౌర హక్కుల పరిరక్షణ చట్టం-1955, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం-1989 ఉల్లంఘనలపై ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు, అసెంబ్లీలు, ప్రజా వేదికల ద్వారా వివక్ష, సామాజిక దురభిప్రాయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులంతా ఏకం కావాలని నిర్ణయించారు. 

బీజేపీ, బీఆర్ఎస్ దళితులకు వ్యతిరేకం: మంత్రి వివేక్  


హల్ద్వానీలో ఖర్గే ర్యాలీ అనంతరం జరిగిన శుద్ధీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా దళితులంతా ఐక్యం కావాలని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. బీజేపీ పాలనలో దళితుల పట్ల వివక్ష కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఇంటికి దళితులు వెళ్లినప్పుడు ‘శుద్ధీకరణ’ చేశారని మండిపడ్డారు. ఈ ఘటనపై తెలంగాణ దళితులంతా ఏకమై పోరాడారని గుర్తు చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించబోమని హెచ్చరించారు.  ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. 
దళితులపై వివక్షకు వ్యతిరేకంగా రాహుల్‌‌‌‌ గాంధీ స్పష్టమైన వైఖరితో స్పందించారని మంత్రి తెలిపారు. దళితులను అవమానించే, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను నేరంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఈ వర్గాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. 150 ఏండ్లకు పైగా చరిత్ర ఉన్న పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ఖర్గే ప్రసంగించిన తర్వాత వేదికను శుద్ధి చేయడం చాలా దారుణం. అన్ని వర్గాలను గౌరవించినప్పుడే సమాజం ముందుకు సాగుతుంది’’ అని అన్నారు. దళిత, ఆదివాసీ సమస్యలు, రక్షణ కోసం కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం పోరాడాలని ఆయన కోరారు. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలు ఒకే వేదికపైకి రావడం ఒక కీలకమైన ముందడుగు అని, ఇకపై కూడా ఐక్యంగా పోరాటం కొనసాగించాలని మంత్రి కోరారు.    

మనువాదంతో సమాజం విభజన: అద్దంకి 

బీజేపీ మనువాదాన్ని ప్రోత్సహిస్తూ సమాజాన్ని విభజిస్తోందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. సనాతన ధర్మం పేరుతో అంటరానితనాన్ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాఖండ్ ఘటనను బీజేపీ, ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్ వ్యతిరేకించలేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఫామ్‌‌‌‌హౌస్ వద్ద కాంగ్రెస్ దళిత నేతలపై పసుపు నీళ్లు చల్లారని ఆరోపించారు. ఖర్గేపై జరిగిన ఘటనను 
రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తున్నామని చెప్పారు.  

దళిత, ఆదివాసీల ఐక్యతతోనే సామాజిక ప్రగతి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ   
దళిత, ఆదివాసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే సామాజిక ప్రగతి సాధ్యమవుతుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. దళిత-, ఆదివాసీల ఆత్మగౌరవం, హక్కులు, సామాజిక న్యాయం కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌, మనుస్మృతి సిద్ధాంతాలు దేశాన్ని విభజించి పాలించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వీటికి వ్యతిరేకంగా దళితులు, ఆదివాసీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు ఐక్యంగా నిలవాలన్నారు. సమాజాన్ని కులాలు, వర్గాలుగా విభజించడం వల్ల అణగారిన వర్గాల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని, అందువల్ల పరస్పర ఐక్యతను బలోపేతం చేసుకోవాలని వివరించారు. “దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ వర్గాల జనాభా 30 శాతం ఉన్నప్పుడు, బడ్జెట్ కేటాయింపులు కేవలం 3 శాతం మాత్రమే ఎందుకు?” అని ఎంపీ ప్రశ్నించారు. జనాభా దామాషా ప్రకారం నిధులు, అవకాశాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన, అణచివేతకు గురైన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలోనే బిగ్గెస్ట్ లూజర్ అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. ప్రతిపక్ష నేతగానూ ఆయన పూర్తిగా విఫలమయ్యారన్నారు. ‘‘కేటీఆర్ తీవ్ర అసహనంతో ఉన్నారు. తెలంగాణలో అతిపెద్ద ఓటమిని చవిచూశారు. సీఎం కాలేకపోవడంతోనే ఈ అసహనం. అందుకే అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో 25 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కేటీఆరే బాధ్యుడు. అయినా దీనిపై ప్రజల ముందు మాట్లాడే ధైర్యం ఆయనకు లేదు. సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా కేటీఆర్ వాస్తవాలను బహిర్గతం చేసి, ప్రజలకు నిజం చెప్పి బాధ్యత స్వీకరించాలి” అని వంశీకృష్ణ అన్నారు.