జూబ్లీహిల్స్‎లో మెజారిటీ ఇస్తే.. మరింత స్ట్రాంగ్‏గా పని చేస్తం: మంత్రి వివేక్

జూబ్లీహిల్స్‎లో మెజారిటీ ఇస్తే.. మరింత స్ట్రాంగ్‏గా పని చేస్తం: మంత్రి వివేక్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‎కు మంచి మెజారిటీ ఇస్తే మరింత స్ట్రాంగ్‎గా పని చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం (అక్టోబర్ 31) షేక్ పేట్ డివిజన్‎లోని పరమాంట్ కాలనీలో మైనార్టీ నేతల సమావేశం నిర్వహించారు. మంత్రి వివేక్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 

నాయకుడు అంటే నిత్యం ప్రజల్లో ఉండి వాళ్ల సమస్యలు తెలసుకోవాలని.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‎లో ఆ లక్షణాలు ఉన్నాయని అన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ముస్లింలకు సీఎం రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని.. ఇందులో భాగంగానే ముస్లిం వ్యక్తిని అడిషనల్ అడ్వకేట్ జనరల్‎గా నియమించారని తెలిపారు.

ముస్లిం వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి ముందే నిర్ణయించారని.. కానీ ఎమ్మెల్యే లేకపోవడంతో ఇవ్వలేదన్నారు. ఈ నేపథ్యంలోనే అజారుద్దీన్‎కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారన్నారు. అజారుద్దీన్‎కు మంత్రి పదవి దక్కకుండా బీజేపీ ప్రయ్నతం చేసిందని అన్నారు. 

బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని.. బీఆర్ఎస్‎కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు అన్ని బీజేపీకె పడ్డాయని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‎ను భారీ మెజార్టీతో గెలిపించాలని.. ఎన్నిక తర్వాత ముస్లింలకు స్మశాన వాటిక స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.