
- షేక్‌పేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
జూబ్లీహిల్స్, వెలుగు: కాళేశ్వరం పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు వృథా చేసిందని మంత్రి వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. పేదల అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు. హైదరాబాద్ షేక్ పేటలో డ్రైనేజీ, సీసీ రోడ్ల పనుల ప్రారంభానికి గురువారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ‘‘మొదట షేక్‌పేటకు వచ్చినప్పుడు ఇక్కడి పార్టీ లీడర్లతో కొంత సఖ్యత ఉండేది కాదు. ఇప్పుడు నాయకులందరూ ఏకతాటిపై వచ్చి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది.
ఇక్కడి ప్రజలు వారం కింద అడిగిన పనులను వెంటనే మంజూరు చేసి ప్రారంభించాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ఈ ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, కమ్యూనిటీ హాల్, స్మశాన వాటిక కోసం రూ.33 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పదేండ్లు పాలించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం. సన్న బియ్యం పథకం అమల్లోకి తెచ్చాం’’అని మంత్రి వివేక్ అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కవిత బట్టబయలు చేసిందని తెలిపారు. కమీషన్లకు కక్కుర్తిపడి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో నిధులను దుర్వినియోగం చేసిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్, రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, నేతలు నవీన్ యాదవ్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.