
ఆదివారం ( జులై 13 ) మంచిర్యాల జిల్లా మందమర్రిలో మార్నింగ్ వాక్ నిర్వహించిన మంత్రి వివేక్ వెంకటస్వామి 23వ వార్డు బురుదగూడెం,సుభాష్ నగర్ లో నెలకొన్న సమస్యలు,ప్రజల సమస్యలను అడిగి.తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు కాలనీవాసులు. దీంతో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి వివేక్. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. సింగరేణిలో కొత్త గనులు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తానని అన్నారు.
సింగరేణిలో కొత్త గనులు తీసుకువచ్చి సింగరేణి మనుగడను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరానని.. సింగరేణి సంస్థ టెండర్ ప్రక్రియలో పాల్గొంటే కొత్త గనులు వస్తాయి,కొత్త ఉద్యోగాలు సాధించుకోవచ్చని అన్నారు మంత్రి వివేక్. సింగరేణిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం వేజెస్ పెంచేలా కృషి చేస్తానని అన్నారు. కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ లో రాష్ట్రంలోని ఔట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం వేజెస్ పెంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రులతో చర్చించడం జరిగిందని అన్నారు మంత్రి వివేక్.
ఎమ్మెల్యే గా గెలుపొందాక తెలంగాణలో మొదటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను మందమర్రిలో ఏర్పాటు చేశానని.. నిరుద్యోగ యువత స్కిల్ డెవలప్ సెంటర్ ను సద్వినియోగం చేసుకొని ఉద్యోగ అవకాశాలు సాధించుకోవాలని అన్నారు. మినీమం వేజెస్ ఔట్ సోర్సింగ్,గిగ్ వర్కర్స్ ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారి హక్కులను కాపాడే బాధ్యత తనపై ఉందని అన్నారు మంత్రి వివేక్.