ప్రభుత్వానికి పరిశ్రమలు సలహాలివ్వాలి.. విధానాల రూపకల్పనలో వాటిని పరిగణనలోకి తీసుకుంటం: మంత్రి వివేక్

ప్రభుత్వానికి పరిశ్రమలు సలహాలివ్వాలి.. విధానాల రూపకల్పనలో వాటిని పరిగణనలోకి తీసుకుంటం: మంత్రి వివేక్
  • విదేశీ భాషలు నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వెల్లడి 
  • ఐటీఐ అప్‌‌గ్రేడేషన్‌‌ స్కీమ్‌‌పై కంపెనీల ప్రతినిధులతో మీటింగ్ 
  • ప్రముఖ సంస్థలతో టామ్‌‌కామ్ ఎంవోయూలు 

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వానికి పరిశ్రమలు సలహాలు ఇవ్వాలని, వాటిని విధానాల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. పరిశ్రమలు, విద్యాసంస్థల సహకారంతోనే 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ఐటీఐ అప్‌‌గ్రేడేషన్ స్కీమ్‌‌పై వివిధ కంపెనీల ప్రతినిధులతో బుధవారం సెక్రటేరియెట్‌‌లో మంత్రి వివేక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ సంస్థలతో టామ్‌‌కామ్ (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌‌పవర్ కంపెనీ లిమిటెడ్) పలు అవగాహన ఒప్పందాలు చేసుకుంది. 

ఇన్ఫోసిస్‌‌, నిర్మాణ్ ఎన్‌‌జీవో, అపోలో గ్లోబల్, ఐఈఎస్, ఎస్‌‌ఐ కన్సల్టెన్సీ సంస్థలతో స్కిల్‌‌ డెవలప్‌‌మెంట్, విదేశాల్లో ఉపాధి కల్పన అంశాలకు సంబంధించి ఎంవోయూలు జరిగాయి. ఈ సందర్భంగా కంపెనీల ప్రతినిధులతో మంత్రి వివేక్ వెంకటస్వామి, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ సమావేశమయ్యారు. పరిశ్రమలు ఎదుర్కొనే సవాళ్లపై సమగ్రంగా చర్చించారు. జర్మన్, జపనీస్‌‌ వంటి విదేశీ భాషలు నేర్చుకుంటే విదేశాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి అన్నారు. ‘హబ్ అండ్ స్పోక్ మోడల్’ ఆధారంగా రూపుదిద్దుకున్న ఐటీఐ అప్‌‌గ్రేడేషన్ స్కీమ్‌‌పై దానకిశోర్ వివరించారు. 

ఒక ఐటీఐని హబ్‌‌గా తీసుకుని సమీపంలోని మరో నాలుగు ఐటీఐలను కలిపి, పెద్ద పరిశ్రమ భాగస్వామి పర్యవేక్షణలో శిక్షణ ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో హెక్సగాన్, ఏఎంఆర్‌‌ఏసీఈ, నామ్‌‌టెక్, అపోలో గ్లోబల్, సీఐఐ, క్రెడాయ్, నాస్‌‌కామ్, డీఎంజీ మోరి, ష్నైడర్ ఎలక్ట్రిక్, అపోలో మెడ్ స్కిల్స్, ఏస్ డిజైనర్స్ లిమిటెడ్, వీఏఎం టెక్నాలజీస్, ఆబ్జెక్ట్ వన్, కూకా రోబోటిక్స్ తదితర సంస్థలు పాల్గొన్నాయి. నైపుణ్య లోటుపాట్లు, పాఠ్యాంశాల ఆధునీకరణ, ఉద్యోగ అవసరాలు, ఉద్యోగం చేసుకుంటూనే చదువుకునే విధానాలపై కంపెనీల ప్రతినిధులు పలు సూచనలు చేశారు.