
తెలంగాణలో మూడు దశల్లో 111 ఏటీసీలను అభివృద్ధి చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ సచివాలయంలో కార్మిక ,ఉపాధికల్పన,గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడిన రేవంత్.. రైజింగ్ 2047 కు అనుగుణంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ఏటీసీల్లో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు.
ఫస్ట్ ఫేజ్ లో 25, ఫేజ్ 2 లో 40 ఫేజ్ 3 లో 46 ఏటీసీలను అభివృద్ధి చేయనున్నట్టు అధికారులు సీఎంకు వి వరించారు. ఫేజ్ 1, ఫేజ్ 2కు సంబంధించి 49 ఏటీసీలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని వివరించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తిగా చేసేందుకు అవసరమైతే నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలని సీఎంసూచించారు. ఏటీసీల అభివృద్ధి, పురోగతిపై తాను స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని సీఎం అధికారులకు చెప్పారు.
జీనోమ్ వ్యాలీలో ఒక మోడల్ ఏటీసీని ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకుఅవసరమైన శిక్షణ అందించే కోర్సులు అక్కడ ఏర్పాటు చేయబోయే ఏటీసీలో నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అవసరమైన స్థలం కేటాయింపుతో పాటు అధునాతన సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ATC పోస్టర్ ను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి.