మూడో విడత స్థానిక ఎన్నికలకు ఒక్కరోజు సమయం మాత్రమే ఉండటంతో ప్రచారం ముమ్మరం చేశారు ప్రధాన పార్టీల నేతలు. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాలో మూడో విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జిల్లాలోని భీమారం మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామ పంచాయితీలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలను కోరారు మంత్రి వివేక్. కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే సన్న బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. పదేళ్లుగా గత ప్రభుత్వం ఇవ్వని రేషన్ కార్డులను అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇవ్వడం జరిగిందని.. గత ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు మంత్రి వివేక్.
గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇస్తామని మోసం చేసిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరిగిందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నిటిని అమలు చేసిందని.. ప్రతీ ఒక్క అర్హుడికి సంక్షేమ పథకాలు అందజేస్తుందని అన్నారు మంత్రి వివేక్. నియోజకవర్గంలో ఇప్పటికే 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసుకున్నామని.. గ్రామాల్లో నీటి సమస్యలు లేకుండా బోర్లు వేసి నీరు అందించామని అన్నారు. గ్రామాల్లో డ్రైనేజీలు సీసీ రోడ్లు వేసి గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు మంత్రి వివేక్.
