కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు: మంత్రి వివేక్ వెంకటస్వామి

కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు: మంత్రి వివేక్ వెంకటస్వామి

కోల్​బెల్ట్/చెన్నూరు, వెలుగు: కమీషన్ల కోసమే మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, దుబారా ఖర్చులతో రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు క్యాంపు ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోటపల్లి మండలం దేవులవాడ, అర్జునగుట్ట, రాపన్​పల్లి, రావులపల్లి గ్రామాలకు చెందిన కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపు బాధితులతో మంత్రి మాట్లాడారు. నష్టపోయిన పంటలకు రాష్ట్ర సర్కార్ సాంక్షన్ చేసిన రూ.10 కోట్ల పరిహారం పంపిణీ, ముంపు భూముల కోనుగోలుపై మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్డీవో శ్రీనివాస్ రావు, కోటపల్లి తహసీల్దార్ రాఘవేంద్రతో సమీక్ష జరిపారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోయి.. అర్హత కలిగిన రైతులందరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులతో తాను తరచూ మాట్లాడి రూ.10 కోట్ల పరిహారం మంజూరయ్యేలా కృషి చేశానన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వాడకుండానే ఈ ఏడాది రికార్డు స్థాయిలో 70 శాతం పంటలు పండించామని తెలిపారు. అనంతరం క్యాంపు ఆఫీసులో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. తన పర్యటనలో భాగంగా నిజామాబాద్ వెళ్తున్న మంత్రి.. మార్గమధ్యలో లక్షెట్టిపేటలోని ఉత్కూర్ చౌరస్తాలో ఆగి స్థానిక కాంగ్రెస్, మాల సంఘం లీడర్లతో మాట్లాడారు.