కేటీఆర్.. పదేళ్లలో ఏం చేశావో ప్రజలకు సమాధానం చెప్పు: మంత్రి వివేక్

కేటీఆర్.. పదేళ్లలో ఏం చేశావో ప్రజలకు సమాధానం చెప్పు: మంత్రి వివేక్

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‎పై మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచామని కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు.. కానీ హైదరాబాద్‎లో ఎక్కడికెళ్లినా 20 ఏళ్ల నుంచి మాకు వరద నీటి సమస్య ఉందని పబ్లిక్ చెబుతున్నారు. ఇదేనా బీఆర్ఎస్ పెంచిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అని ప్రశ్నించారు. పదేళ్లలో ఏం చేశాడో కేటీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి వివేక్. కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టి తెలంగాణను అప్పులు పాలు చేశారని విమర్శించారు. 

బుధవారం (సెప్టెంబర్ 24) కృష్ణానగర్‎లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల ఇన్చార్జ్ విశ్వనాథన్, మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి.. జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. కృష్ణా నగర్‎లో వరద నీటి సమస్య పరిష్కారం కోసం అధికారులతో కలిసి ముందుకు వెళ్తామని చెప్పారు. ఇద్దరు ఇంజనీర్ నిపుణులను నియమించి సమస్య పరిష్కారం కోసం ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. 

జూబ్లీహిల్స్‎లో కూల్చివేతలు చేపట్టేందుకు హైడ్రా జేసీబీలు పెట్టుకొని రెడీగా ఉందంటూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు సూచించారు. జూబ్లీహిల్స్ బై పోల్ కోసమే బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ముందుండటంతో ఫ్రస్టేషన్‎లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.