- తెలంగాణ రైజింగ్ నినాదంతో కార్మిక శాఖ ముందుకు..
- ఏటీసీ స్టూడెంట్స్‌కు నెలకు రూ.2 వేల స్టైఫండ్
- సిగాచి ఇండస్ట్రీలో కార్మికులకు 24.51 కోట్ల పరిహారం అందింది
- ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ పై సర్కారు ఆలోచన
- విదేశీ కొలువుల కోసం టామ్‌కామ్ బలోపేతం
- అసెంబ్లీలో మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని ఆర్థికంగా దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. “తెలంగాణ రైజింగ్” నినాదంతో 2034 నాటికి రాష్ట్ర ఎకానమీని 1 ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆదివారం అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రి మాట్లాడారు.
రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చే దిశగా ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోందని ఆయన వివరించారు. ఇటీవల దావోస్ పర్యటనలో పెట్టుబడిదారులతో చర్చించి సుమారు రూ.7 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ను రాష్ట్రానికి తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీఐలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని ఆధునీకరించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
టాటా సంస్థ సహకారంతో పాత 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీ) మార్చామని, కొత్తగా మరో 53 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సెంటర్లలో ఏఐ, డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఏటీసీల్లో చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్టైఫండ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇది జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. రాష్ట్ర యువతకు విదేశీ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు టామ్‌కామ్‌ను బలోపేతం చేస్తున్నామని, దీనికి బడ్జెట్‌లో రూ.90 కోట్లు కేటాయించామని తెలిపారు.
భాషా నైపుణ్యాల శిక్షణ కోసం అదనంగా రూ.30 కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. వచ్చే నెలలో టామ్‌కామ్ అధికారుల బృందం జర్మనీ పర్యటనకు వెళ్లి అవకాశాలపై అధ్యయనం చేయనున్నట్లు వెల్లడించారు.రాష్ట్రంలో ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్‌లలో 4.32 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారని, వారికి ఏటీసీల ద్వారా శిక్షణ కల్పించే చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.
గిగ్ వర్కర్లకు భరోసా..
భారత్ జోడో యాత్రలో గిగ్ వర్కర్ల కష్టాలను చూసి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కొత్తగా గిగ్ వర్కర్ల చట్టం తీసుకువస్తున్నట్లు మంత్రి వివేక్ ప్రకటించారు. దీనిపై సోమవారం అసెంబ్లీలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఈ విభాగంలో సుమారు 2 లక్షల మంది పనిచేస్తున్నారని, వారికి ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సిగాచి ఇండస్ట్రీలో కార్మికులకు రూ.24.51 కోట్ల పరిహారం అందించినట్లు మంత్రి తెలిపారు. కొందరికి 50 శాతం, మరికొందరికి 60 శాతం మేర పరిహారం చెల్లించామని చెప్పారు. రాష్ట్రంలో 46 లక్షల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారని, వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఇందిరమ్మ జీవన్ బీమా పథకం కూడా వారికి వర్తిస్తోందన్నారు. వలస కార్మికుల కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని వివరించారు.
