
ఇండియా, జపాన్ కలిసి పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో పూర్తయిన రెండు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను మంత్రి వివేక్ వెంకటస్వామి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలిసి ప్రారంభించారు. దీంతో పాటు మరో రెండు కొత్త యూనిట్లకు ఇవాళ భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. రాష్ట్రంలో తోషిబా మరిన్ని పెట్టుబుడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. తోషిబా ద్వారా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. జపాన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ప్రారంభించాలని సూచించారు. జపాన్ టెక్నాలజీ తెలంగాణ ప్రజలకు అందించాలని చెప్పారు మంత్రి వివేక్. ఇండియా- జపాన్ వాణిజ్య పరంగా ముందుకు సాగుతోందన్నారు. తోషిబా ఉత్పత్తి చేసిన ట్రాన్స్ఫర్స్ క్వాలిటీతో ఉంటాయని తెలిపారు.
తెలంగాణలో జపాన్ కు చెందిన తోషిబా కంపెనీ భారీ పెట్టుబడులు పెడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కంపెనీ విస్తరణలో భాగంగా రూ.347 కోట్లతో సంగారెడ్డిలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం ఏప్రిల్ 22, 2025న జపాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నసంగతి తెలిసిందే.. తోషిబా ట్రాన్స్ మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియాతో హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో విద్యుత్ పరికరాలు, సామాగ్రి తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రూ.562 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ కుదుర్చుకుంది.