మంచిర్యాల జిల్లా, మందమర్రి: మందమర్రి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని కార్మిక, గనుల, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో మంత్రి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
మందమర్రి మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో రూ.14.75 కోట్ల UIDF నిధులతో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.
చెన్నూరును టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తాం
చెన్నూరులో ఉన్న పురాతన శివాలయం, మొసళ్ల అభయారణ్యాన్ని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.మందమర్రిలో ప్రస్తుతం 70 మంది యువత జర్మన్ భాషపై శిక్షణ పొందుతున్నారని వివేక్ వెంకటస్వామి తెలిపారు. జర్మన్ భాషపై పట్టు సాధించిన యువతకు జర్మనీలో సుమారు రూ.25 లక్షల ప్యాకేజీతో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
అమృత్ పథకం కింద మందమర్రిలో ఇంటింటికీ మంచినీరు అందించేందుకు పనులు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. జనవరిలో ప్రజలకు తాగునీరు అందించేలా పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.మందమర్రి ప్రాంత అభివృద్ధి, ఉపాధి అవకాశాల కోసం ఆర్కే ఓపెన్ కాస్ట్ గనిని తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి కృషి చేశానని వివేక్ వెంకటస్వామి తెలిపారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
